మంచురియా దోశ... కొత్తిమీర చట్నీతో
తినటానికి పిల్లలే గనకా పేచీలు పెట్టక పోతే ఇన్ని రకాల వంటలు మనం కనిపెట్టమేమో..వాళ్ళకి ఒకేరకం రుచి రెండో సారికి నచ్చదు. దాంతో మనం అవే దినుసులు, కూరలు తో రక రకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి దోసలే తీసుకోండి. ఏంటి ఎప్పుడూ దోసలేనా ? బోర్ అంటారు పిల్లలు. అలాంటప్పుడే మనం మన క్రియేటివిటీ కి పదును పెట్టాల్సి వస్తుంది. అలా మా పిల్లలు నాకు పదును పెడుతుంటారు ..." నచ్చాలే " అన్న ఒక్క పదం తో...వాళ్ళ కోసం నేను కనిపెట్టిన దోసల రకాలు ఏంటో మీకు చెబుతాను. మీరూ ట్రై చేయండి. అవి రుచి గా ఉంటాయని కచ్చితం గా చెప్పగలను. లేకపోతే తినరు గా మా బుడుగులు. ఈ రోజు మంచురియా దోస రుచి చూబిస్తున్నా...పేరు బట్టి నేను ఉహించి చేసాను కాబట్టి , మీరు కూడా మీకు నచ్చిన మార్పులు చేసుకోవచ్చు ..నేను ఐడియా ఇస్తున్నా అంతే.
కావలసినవి:
దోశల పిండి - తగినంత
కాబేజీ - అర ముక్క
అల్లం తరుగు- ఒక స్పూన్
వెల్లుల్లి తరుగు - అర స్పూన్
పచ్చి మిర్చి తరుగు - పావు స్పూన్
సోయా సాస్ - అర స్పూన్
అజినమోటో - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - దోసలకి తగినంత
తయారీ విధానం
దోసల పిండి తాజాగా ఉంటేనే ఈ దోసెలు బావుంటాయి. పుల్లటి పిండి బావుండదు. ముందుగా కాబేజీ ని సన్నగా తురుము కోవాలి . బాణలి లో చాలా కొద్దిగా (ఒక చెమ్చా ) నూనె వేసి ,వేడి కాగానే అల్లం వేసి వేయించాలి , కొంచం వేగగానే పచ్చి మిర్చి వేయాలి. అవి ఎర్రగా అవుతుండగా వెల్లులి వేసి అవి ఎక్కువ వేగకుండానే కాబేజీ వేసేయాలి. వెల్లుల్లి వేగితే రుచి మారుతుంది. అప్పుడే ఉప్పు కూడా వేసి బాగా కలిపి , మూత పెట్టకుండా వేయించాలి. మూత ఎందుకు పెట్టకూడదు అంటే..
మూత పెడితే ఆవిరికి కాబేజీ లోకి తడి వస్తుంది. మనకి వేయించిన రుచి పోతుంది. కాబేజీ వేగాలి, ఉడుకితే రుచి వేరేగా వుంటుంది.. వేగితే రుచి వేరు.
కాబేజీ కొంచం వేగగానే సోయా సాస్, అజినమోటో వేసి కలపాలి. ఆ తర్వాత ఓ అయిదు నిముషాలు వేయించి దించేయాలి.
పెనం వేడి చేసి , దోస వేయాలి. దోస మీద కాబేజీ కూరని వేసి స్ప్రెడ్ చేయాలి దోస నిండా. దోస ని ఒక వైపే కాల్చాలి కాబట్టి పెద్ద మంట మీదే ఉంచాలి స్టవ్. అప్పుడే ఎర్రగా కాలుతుంది దోస.అలా ఒక వైపు కాల్చిన దోసని మధ్యకి మడిచి ప్లేట్ లో పెట్టి , పక్కన కొత్తిమీర చట్నీ వేసి మీ వాళ్ళకి పెట్టరను కోండి..మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు వాళ్ళు.
ఒకో రకం దోస కి ఒకో రకం చట్నీ కాంబినేషన్ ...ఈ దోసకి కొత్తిమీర బావుంటుంది. కొత్తిమీర చట్నీ అనగానే వేయించి , పోపు వేసి కాదు ..సింపుల్ గా చేసేయచ్చు .
కొత్తి మీర చట్నీ:
కొత్తిమీర ని బాగా కడిగి సన్నగా తరుగు కుని , అందులో పచ్చి మిర్చి, ఉప్పు, కొంచం బెల్లం, వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా రెడీ అయిన చట్నీ లో కొంచం నిమ్మరసం కలిపితే భలే రుచిగా వుంటుంది. నిమ్మరసం వద్దు అనుకుంటే డ్రై మ్యాంగో పౌడర్ చిటికెడు వేసుకోవచ్చు. కాని పులుపు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కొత్తిమీర పచ్చి వాసన తో చట్నీ బావుంటుంది.