కోరు ఆవకాయ

 

 

పేరు వినగానే అర్ధం అయిపోతోంది కదా.. సాధారణంగా మామిడి కాయ చెక్కు తీసి కోరి ఎండలో పెట్టి , ఉప్పు, కారం,మెంతి పొడి కలిపి ఫైన ఇంగువ పోపు వేస్తే అది మామిడి కోరు పచ్చడి అంటారు. పుల్లగా , చాలా బావుంటుంది ఆ పచ్చడి. అయతే ఇప్పుడు మనం చెప్పుకునే కోరు ఆవకాయలో మెంతి పిండి బదులు ఆవపిండి వేస్తాం.

 

కావలసిన పదార్ధాలు:

మామిడి కాయలు - 2
ఉప్పు - పావు గ్లాసు
కారం - అర గ్లాస్సు
ఆవపిండి - ఒక గ్లాసు
నూనె - చిన్న కప్పుతో
మెంతులు - పావు చెంచా

 

తయారీ విధానం:

ముందుగా మామిడికాయని చెక్కు తీసి, తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. ఆఖరుగా అందులో మామిడి కోరు, మెంతులు, నూనె వేసి కలపాలి. ఓ పూట పక్కన వుంచి తింటే బావుంటుంది. సాధారణంగా ఆవపిండి తిని ముక్కలు వదిలేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికి ఈ పచ్చడి బాగా నచ్చుతుంది. ఆవపిండిలో మామిడి కోరు ఊరి చాలా రుచిగా వుంటుంది.

 

టిప్ :

1. ఆవకాయకి ఉప్పు, కారం, ఆవపిండి సరైన పాళ్ళలో కలిస్తేనే రుచి. అలా సరైన పాళ్ళలో కలవాలంటే ఆవకాయ ఫార్ములా తెలియాలి. సింపుల్ గా ఈ మూడు నంబర్స్ గుర్తు పెట్టుకోండి చాలు. 3, 2, 1...మా అమ్మమ్మ చెప్పిన ఫార్ములా ఇది. 3 గ్లాసుల ఆవపిండి వేస్తె, రెండు గ్లాసుల కారం, ఒక గ్లాసు ఉప్పు వేయాలి. ఆవ ఘాటు అంత ఎక్కువ వద్దు అనుకుంటే, ఆవపిండి, కారం సమానంగా వేయాలి.

2. ఇదే పచ్చడిలో కొంచెం కారం, ఆవపిండి తగ్గించి బెల్లం కోరు కలిపితే తీపి కోరు ఆవకాయ అవుతుంది.