టమాటా చట్నీ కేరళ స్టైల్

 

 

 

మొదటిసారి ఈ చట్నీ గురించి విన్నప్పుడు, ఏముంది మామూలు పద్ధతేగా అనిపించింది. కాని రుచి చూసాకా నిజమే... భలే ఉంది అనిపించింది. మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు ముందుగా టమాటాలని నూనెలో మగ్గించి, పోపులో కలిపి రుబ్బుతాం కదా! కేరళలో పచ్చి టమాటాలని గ్రైండ్ చేసి మగ్గిస్తారు. తేడా చిన్నదే అయినా టమాటాలలోని పచ్చి రుచి మనకి తెలుస్తూనే ఉంటుంది. ఈ చట్నీని కేరళలో వివిధ రకాలుగా చేస్తారు. మేం కేరళ వెళ్లినప్పుడు ఓ హోటల్ లో దోశలతో పాటు టమాటా చట్నీ ఇచ్చాడు. రుచి బావుంది ఎలా చేశారని అడిగితే పచ్చి టమాటా, కొబ్బరి, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసి పైన ఆవాలుతో పోపు చేసారట. కాని భలే టేస్ట్ గా ఉంది.

 

సరే ఈ రోజు మనం చెప్పుకునే కేరళ పచ్చడికి కావల్సిన పదార్ధాలు ఇవి.

టమాటాలు         - 5
పచ్చిమిర్చి         - 2
నూనె                 - రెండు చెమ్చాలు
కరివేపాకు          - తగినంత
ఆవాలు              - పావు చెమ్చా
ఇంగువ              - చిటికెడు
పసుపు              - చిటికెడు
ఉప్పు                - రుచికి సరిపడా

 

తయారీ విధానం:

ముందుగా టమాటాలని నాలుగు ముక్కలుగా కోసి, పచ్చిమిర్చితో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. టమాటా కొంచం నీరు నీరుగా వస్తుంది. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఆవాలు కరివేపాకు, ఇంగువ వేసి, ఆవాలు చిటపటలాడాకా రుబ్బుకున్న టమాటా మిశ్రమాన్ని చేర్చి ఉప్పు, పసుపు వేసి దగ్గరగా అయ్యేవరకు మగ్గించాలి. మూత పెట్టకుండా కదుపుతూ ఉంటే టమాటా మిశ్రమం దగ్గర పడుతుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీలతో తింటే బావుంటుంది. కొబ్బరన్నంతో కూడా ఈ చట్నీ తింటారు కొందరు. టమాటా గ్రైండ్ చేసాకా ఉడికించటంతో టమాటా పచ్చివాసన పూర్తిగా పోదు. దాంతో రెగ్యులర్ చట్నీలా కాక డిఫరంట్ రుచి వస్తుంది ఈ చట్నీకి.

 

-రమ