నోరూరించే కాకినాడ స్పెషల్ ఆవకాయ

 

 

అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు అని ఎదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు. ఆవకాయ రుచి ని ఆస్వాదించడానికి ఆంధ్ర, తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు , చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు, పేదవాడికి, ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ.. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు, ఇప్పుడు మనం కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల్లో బాగా ఫేమస్ ఐన తూర్పు ఆవకాయ గురించి తెల్సుకుందాం...

దీని ప్రత్యేకత ఏంటంటే గొల్లప్రోలు మిరపకాయలు , మాడుగుల ఆవపిండి తో ఈ ఆవకాయ పడతారు. రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు , కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి..


ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి :

ముందుగా మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజు లో ముక్కలు కోసి పెట్టుకోవాలి 

మామిడి ముక్కలు - 6కప్పులు 

కారం - ఒక కప్పు

ఆవపిండి - 3 కప్పులు 

పసుపు - తగినంత 

నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత 

ఉప్పు (దొడ్డు ఉప్పు)  - 3/4 వంతు కప్పు 

బెల్లం - 125 గ్రా 

ఇంగువ - కొంచెం

మెంతి పిండి - 1 /2 టేబుల్ స్పూన్ 


తయారు చేసే విధానం : 

ముందుగా మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని దానితో మూడు కప్పుల ఆవపిండి తీసుకుందాం.. దానిలో (అర)1/2 కప్పు కారం వేయాలి , కారం ఇంత తక్కువ దేనికోసం అంటే ఆ గొల్లప్రోలు కారం చూడడానికి ఎర్రగా ఉండదు కానీ చాల ఘాటుగా ఉంటుంది అందుకే సగం కప్పు కారం సరిపోతుంది. ఇంకా ఇందులో ఒక కప్పు ఉప్పు కలపాలి , పసుపు కూడా చిటికెడు వేసుకోవాలి, ఇంగువ అనేది మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. 3 /4 కప్పు బెల్లం కూడా వేయాలి.
 
ఇపుడు మరొక పెద్ద గిన్నె తీస్కుని ఒకటిన్నర గిన్నెలు మామిడి కాయ ముక్కలు తీసుకోవాలి , అదే గిన్నె కొలతతో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకుకోవాలి. ముక్కలు మునిగేంత నూనె తీస్కుని ఆ నూనెలో మామిడి కాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె పట్టించి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి.. ఇపుడా నూనె లో ఒక గిన్నె తో ఉంచిన కారం మిశ్రమం వేయాలి.

మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అంతా బాగా కలపాలి.. ఇలా కలిపిన ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి , బాగా ఊరిన తర్వాత , ముక్కలు , ఊట వేరు వేరుగా చేసి ముక్కల్ని ఊటని ఎండలో పెట్టి ఉప్పు చూసుకుని ,ముక్కలు మునిగేంత నూనె పోసుకుని బాగా కలుపుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు ఆవకాయ పాడవకుండా ఉంటుంది. కమ్మగా , రుచి గ , చాల బాగుంటుంది.. ఇదండీ ఈజీ గా అందరూ పెట్టగలిగే కాకినాడ స్పెషల్ తూర్పు ఆవకాయ , ఆలస్యం చేయకుండా ఎవరిపై ఆధారపడకుండా ఆవకాయ పెట్టేసుకోండి