![]() |
![]() |
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ముఖ్యమంత్రి పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని, సో .. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరగే అవకాశాలు అంతగా లేవనీ ఒక విధంగా చెప్పాలంటే మంత్రి వర్గ విస్తరణ నిరవధికంగా వాయిదా పడినట్లేనని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సహా మరి కొన్ని మంత్రులు లేని శాఖల పరిస్థితి అక్క మొగుడే’ దిక్కన్నట్లు తయారైందని అధికార వర్గాలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మత్రులున్నారు. మరో ఏడుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానంతో సంబంధాలు బాగున్న రోజుల్లో ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పార్టీ అధిష్టానం ముందుంచిన ఎజెండాలో మంత్రి వర్గ విస్తరణ తప్పక ఉండేదని అంటారు.
అంతే కాదు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఒకటి రెండు సార్లు మంత్రి పొంగులేటి, ఇతర మంత్రులు మంత్రి వర్గ విస్తరణ కొంచెం అటూ ఇటుగా ఫలానా తేదీ లోగా ఉంటుందని ముహూర్తాలు కూడా నిర్ణయించారు. అయితే ముహూర్త తిథులు, తేదీలు వచ్చాయి, పోయాయి కానీ మంత్రి వర్గ విస్తరణకు ముడి పడలేదు.
అదలా ఉంటే, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఒకటి కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కారణాలు వేరైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ విచారణ నివేదిక ఆధారంగానే ఉద్వాసనకు నిర్ణయం జరిగిందని సో, ఆ ముగ్గురుకి ఉద్వాసన తప్పక పోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
అదొకటి అలా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా నేరుగా ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్న విజయ శాంతికి కాబినెట్ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా, మరో ముగ్గురు కొత్త వారికి అవకాశం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇందంతా జరిగేది ఎప్పుడు అంటే మాత్రం ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోతున్నారు. ముందుగా ప్రస్తుతానికి ఆలోచ , విచారణ దశలోనే ఉన్న ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకున తర్వాతనే మంత్రి వర్గ నిర్ణయం ఉంటుందని ఢిల్లీతో టచ్ లో ఉన్న నాయకులు అంటున్నారు.
అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి మార్పు పై నిర్ణయం అంత సులభంగా తేలే వ్యవహారం కాదని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని అధిష్టానానికి కూడా తెలుసని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరి వెంట ఎంత మంది ఉన్నారు, ఇతర పార్టీలతో టచ్’లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, లేదా ఇతర ముఖ్య నాయకులతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? వంటి వివరాలన్నీ అధిష్టానం సిద్దం చేసుకుందని అంటున్నారు. అలాగే, ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు గోడ దూకుడు లెక్కలకు సంబంధించి వివరాలు సైతం అధిష్టానం వద్ద ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది. సో.. ఎలా చూసినా కాంగ్రెస్ అధిష్టానం తొందరు పాటు నిర్ణయం తీసుకోదని అంటున్నారు. సో... చివరికి ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఉత్తమ నిర్ణయంగా అధిష్టానం తీసుకున్నా తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇదలా ఉంటే రామాయణంలో పిడకల వేట అన్నట్లు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పని కాదని, రాములమ్మలా నేరుగా దేహికి వెళ్లి మంత్రి పదవి తెచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
![]() |
![]() |