![]() |
![]() |
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ నేతలకు ప్రజలనుంచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ డీలిమిటేషన్, త్రిభాషా సూత్రాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది పార్టీలను కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిథులు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాయకులను చెన్నై వేదికగా ఈ నెల 22న జరిగే అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. చెన్నై వేదికగా డీఎంకే నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో కేంద్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలకు, కసరత్తుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుంది.
డీఎంకే నేతలు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. త్రిభాషా సూత్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులలో, పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నేతలందరిలో ఏకాభిప్రాయమే వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా డీలిమిటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగా విమర్శించారు. దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలంతా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా డీలిమిటేషన్ కు అనుకూలంగా తప్ప వ్యతిరేకంగా నోరెత్తలేని సంక్లిష్ట స్థితిలో వారు మిగిలిపోయారు. ఎందుకంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నోరెత్తలేరు.. అలాగని దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. డిలిమిటేషన్ పేరిట కాంగ్రెస్, డీఎంకేలు విభజన రాజకీయాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి పడ్డారు. దక్షిణాది బీజేపీ నేతలు డిలిమిటేషన్ పై ఈ విమర్శ మాత్రమే చేయగలరనీ, అయితే ఇదేమీ వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. దక్షిణాదిలో కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఒకింత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డిమిలిటేషన్ వ్యవహారం తెలంగాణలో కూడా ఆ పార్టీ పరిస్థితిని మళ్లీ మెదటికి తీసుకువస్తుందన్న భావన రాజకీయవర్గాలలోనే కాదు, బీజేపీ శ్రేణులలో సైతం వ్యక్తం అవుతోంది.
![]() |
![]() |