కోర్టు తీర్పుతో కంగు తిన్నరఘువీరా రెడ్డి

 

పదవుల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాంగ్రెస్ కు కొత్తేమి కాదు. కొద్ది నెలల క్రితం జరిగిన సహకార ఎన్నికలలో విజయ బావుటా ఎగుర వేశామని టముకు వేసుకొన్న కాంగ్రెస్ పార్టీ, అందుకు ఎన్ని అడ్డుదారులు త్రొక్కిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైకాపా అధిపత్యం కనబరిచిన కడప జిల్లాలో, తెదేపా ఆధిఖ్యత గల గుంటూరు జిల్లాలోను కాంగ్రెస్ ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు.

 

అనంతపురం జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఎన్నికలలో మెజారిటీ పదవులను ఖాతాలో వేసుకొందామని అత్యాశకి పోయిన ఆ జిల్లా మంత్రి రఘువీరా రెడ్డి, బకాయిలు పడ్డ (డిఫాల్ట్) సంఘాలకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ ప్రభుత్వం చేత ఒక జీ.ఓ. (నెం:839) జారీ చేయించుకొన్నారు. అనంతపురం జిల్లా కరువు వాత పడటం చేత కొన్ని సంఘాలు బకాయిలు చెల్లించలేకపోయాయని, అందువల్ల వాటికి ఓటు హక్కు కల్పిస్తూ జీఓ జారీ చేయించుకొన్నారు.

 

అయితే ఆ జీఓ కేవలం తన ఒక్క జిల్లాకి మాత్రమే వర్తించేలా జారీ చేయించుకొన్నారు. జిల్లాలో మొత్తం 54 డిఫాల్ట్ సంఘాలకు ఈ జీవో ద్వారా ఓటు హక్కు కల్పించి, తద్వారా అత్యధిక పదవులు కైవసం చేసుకోవాలని రఘువీరా ఆలోచన.

 

అయితే, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈసారి కరువు భారిన పడ్డాయి. అందువల్ల ఆయా జిల్లాలో కూడా అనేక సంఘాలు బాకీలు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ సంఘాలుగా మిగిలిపోయాయి. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ వాటన్నిటికీ వర్తింపజేయకుండా కేవలం తన ఒక్క జిల్లాకే వర్తింపజేసుకోవడంతో, మిగిలిన జిల్లాలో డిఫాల్ట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. కానీ, రఘువీరా వారి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో, వైకాపాకి చెందిన సొసైటీ అధ్యక్షులు ఎల్‌.శివశంకర్‌రెడ్డి హైకోర్టులో ప్రభుత్వ జీవోకి వ్యతిరేఖంగా ఒక ఫిటిషన్‌ వేసారు. దానిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, డిఫాల్ట్‌ సంఘాలకు ఓటు హక్కు కల్పించకూడదని ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో రఘువీరారెడ్డి చేసిన దురాలోచన బెడిసి కొట్టింది.

 

డిఫాల్ట్‌ సంఘాలకు ఓటు హక్కు లేకపోవడంతో, అనంతపురం జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఎన్నికలలో పరిస్థితులు వైకాపాకి అనుకూలంగా మారిపోయాయి. రఘువీరా తలచిందొకటి కానీ జరిగింది మరొకటి. పదవిలో ఉండే కొందరు వ్యక్తులు తాము సమాజానికి, వ్యవస్థకి అతీతులమనే ధోరణి కనబరుస్తుంటారు. అటువంటి వారికి ఇటువంటి గుణపాటాలు తప్పనిసరి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News