జగన్‌‌ మెడకు చుట్టుకుంటోన్న సోషల్‌ మీడియా కేసు

 

ఏపీలో సోషల్‌ మీడియా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు మొత్తం వైసీపీ, జగన్‌ చుట్టే తిరుగుతోంది. పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు రవికిరణ్‌కు వైసీపీతో, సాక్షి మీడియాతో ఉన్న లింకులపైనే ప్రధానంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ ఐటీ వింగ్ ఇన్‌ఛార్జ్ మధుసూదన్‌రెడ్డి విచారణ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మధుసూదన్‌‌ను ప్రశ్నించి వదిలిపెట్టిన పోలీసులు.... కొద్దిసేపటికే మళ్లీ విచారణకు రావాలంటూ ఆదేశించడం అనుమానాలు రేకెత్తించింది.

 

పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గానీ, సాక్షి మీడియాకి గానీ ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఐటీ వింగ్ ఇన్‌ఛార్జ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లక్షల మంది వైసీపీ సానుభూతిపరుల్లో రవికిరణ్‌ ఒకరన్నారు. అయితే రవికిరణ్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందన్నారు. తాము ఎవరినీ కించపర్చలేదంటున్న మధుసూదన్‌రెడ్డి.... ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపైనే వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నట్లు వివరించారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జగన్‌పైనా, వైఎస్‌ కుటుంబంపైనా టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

 

మరోవైపు పొలిటికల్‌ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌‌ను మరోసారి సుదీర్ఘంగా విచారించిన తుళ్లూరు పోలీసులు... వైసీపీతో ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని రవికిరణ్‌ పోలీసులకు వివరణ ఇచ్చాడు. తన వెబ్‌సైట్లో ఒక్క టీడీపీ మీదే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలపైనా సెటైర్లు ఉన్నాయన్నారు. అయితే రవికిరణ్‌ అరెస్ట్‌ సయమంలో సాక్షి ఛానల్‌తో మాట్లాడిన రవికిరణ్‌ భార్య.... తన భర్తకు సాక్షి మీడియాతో సంబంధాలున్నాయని, వాళ్లే జీతాలు చెల్లిస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే పోలీసులు... రవికిరణ్‌ను ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ కేసు... జగన్‌, సాక్షి, వైసీపీ చుట్టే తిరుగుతోంది.