వైసీపీ మరింత డీలా! కుటుంబం, అధికారం అంతా పాయే!
posted on May 14, 2024 11:10AM
ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు అవ్వడం అంటే అధికారపార్టీకి వ్యతిరేకత తీవ్రంగా ఉందని సంకేతం. ఇది సహజ న్యాయసూత్రం. పోలింగ్ సరళి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపి మీద ఈ తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. గత అయిదేళ్లుగా ఏపీలో పసి పిల్లల నుండి వయో వృద్ధుల వరకూ అన్ని వర్గాలు, అన్నికులాలూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆవేశాన్ని ఆవేదనను ఉగ్గబట్టుకుని నిన్న జరిగిన జరిగిన పోలింగ్ లో కసి తీర్చుకున్నారు. భారీ స్థాయిలో జనం ఇళ్ళ నుంచి బయటికి వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు. దీంతో పెద్దయెత్తున పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారు.
పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ అయితే ఏపీలో జోరుగానే జరుగుతోంది. 2019 ఎన్నికల్లోనే 79 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అయితే ఈసారి మరింత పెరిగింది. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ ఈసారి భారీగా పోలింగ్ నమోదు అయింది. అధికార పార్టీ మార్పు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం పెరగడంపై, అధికార పక్షం వైసీపీలో మౌనం ఆవహించింది. ఒకరిద్దరు నాయకులు మాట్లాడుతున్నా.. వారిలో సంతోషం సన్నగిల్లింది. అంతేకాదు.. ముఖంలోనూ కళ లేనట్టే ఉంది. సజ్జల రామకృష్నారెడ్డి, విజయసాయిరెడ్డి, పేర్ని నాని వంటివారు మీడియాతో మాట్లాడినా… పెద్దగా ఉత్సాహం అయితే కనిపించలేదు.
పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ మరింత డీలా పడింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. అది ప్రతిపక్షానికి కలిసి వస్తుంది. మరోవైపు.. యువత పోటెత్తారు. కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్నవారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో జోష్ కనిపించడం లేదు. ఇదిలా వుంటే.. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్ష కూటమి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్‌లు.. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ.. ఓటర్లకు అప్పుడే శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలిపారు. మొత్తంలో ఏపీలో అధికార పార్టీ డీలా పడడం, విపక్షంలో జోష్ కనిపించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి, తనను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని.. తాను ఏం చేసినా ప్రజలు తనను దించరన్న ఓ నమ్మకంతో ఉన్నారు. తాను పడేసే ఎంగిలి మెతుకులు తిని బతికేస్తారని ప్రజలను చులకనగా చూశారు. అయితే ఏపీ ప్రజలు అమాయకులేమీ కాదు. బాగా చైతన్యవంతులైన ఏపీ ఓటర్ కీలు చూసి వాత పెట్టారు. తాము ఇచ్చిన అధికారాన్ని లాక్కోవడం కూడా ప్రజలకు బాగానే తెలుసు. పోలింగ్‌లో అదే జరిగింది. నిజానికి జగన్ రెడ్డి చేసిన తప్పేంటేంటే, అధికారం వచ్చిన తరువాత అందర్నీ దూరం చేసుకున్నారు. తల్లి, చెల్లి మాత్రమే కాదు హితులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమయైపోయారు. ఇప్పుడు అధికారం కూడా పోతోంది. అది జూన్ నాలుగో తేదీన బోధపడుతుంది. . మొత్తంగా అధికారం రావడం గెలుపు కాదని.. ఒక్కో సారి డిజాస్టర్ అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించబోతున్నారు.
- ఎం.కె. ఫజల్