మా భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? పులివెందులలో వైఎస్ భారతిని నిలదీసిన రైతు!

కడప రాజకీయం మారిపోతోంది. ఆ జిల్లాలో వైఎస్ జగన్ ఆధిపత్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. అసలు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

అందులోనూ ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన కడపలో ఈ ధిక్కారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ పులివెందులలో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యపై నిలదీశారు. నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్ కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయడం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లొ ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లి పోగలిగారు. కానీ ఎన్నికల వేళ ఆయన తరఫున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతికి మాత్రం అటువంటి వెసులుబాటు దక్కలేదు. జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని వదిలించుకు వెళ్లలేక తలవంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఔను భర్త జగన్ కోసం ప్రచారం చేస్తున్న వైఎస్ భారతికి ఓ సామాన్యుడు బాంబు లాంటి ప్రశ్న సంధించాడు. మా తాతముత్తాతల నుంచీ నాకు సంక్రమిచిన భూమి పట్టాపై ముఖ్యమంత్రి జగన్ పొటో ఎందుకని అతడు నిలదీశారు. ఆ వ్యక్తి పేరు భాస్కరరెడ్డి. అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంతే కాదు..ఆయన వైసీపీకి చెందిన వ్యక్తే. కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్మరంపల్లె వచ్చిన భారతి మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి జగన్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. అయితే భాస్కరరెడ్డి, తమ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాన్ని చూపుతూ తన భూమి పట్టాపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని నిలదీశారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తున్నదేమిటని నిలదీశారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందనీ, మరి జగన్ చేసిందేమిటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్ కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కరరెడ్డి సంధించిన ఈ ప్రశ్నలలో వేటికీ వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కరరెడ్డి నిలదీస్తున్నంత సేపూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడకుండా అక్కడ నుంచి కదిలి వెళ్లిపోయారు.

సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదురు కావడం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురుకావడం కూడా కద్దు. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అదీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరూ ఊహించను కూడా ఊహించలేరు. కానీ సోమవారం పులివెందులలో ప్రచారం సందర్భంగా ఈ చేదు అనుభవం సీఎం సతీమణికి ఎదురైంది. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పడానికి.  వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడం, దానికి ఎత్తి చూపుతూ సొంత చెల్లి జగన్ పై విమర్శలు గుప్పించడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చిందనీ, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనీ ఈ సంఘటనను ఉదహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.