శాసనమండలిలో ఎదురుదెబ్బ ఎఫెక్ట్... సతమతమవుతున్న వైసీపీ!!

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసన మండలి నిర్ణయంపై న్యాయ నిపుణులు, వైకాపా ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గంట పాటు సాగిన సమావేశంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి , అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం, వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందకపోవటం పై ప్రధానంగా చర్చించారు. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం పై ప్రభుత్వ పరంగా తదుపరి వ్యూహం ఎలా ఉండాలనే అంశంపైన మంతనాలు జరిపారు. ఈ విషయంలో సీఎం జగన్ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజధాని రైతుల పిటిషన్ పై హై కోర్టులో విచారణకు సంబంధించిన అంశం పై కూడా చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణ పై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు. ఈసారి రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. ఎదురుదెబ్బలు తగలకుండా ముందుకు సాగేలా నిర్ణయాలను తీసుకోవాలని నేతలకు దిశా నిర్ధేశం చేశారు జగన్.