ఫిబ్రవరి 2 నుంచి మరో యాత్ర.. జగన్ దూకుడు
posted on Jan 8, 2019 12:11PM

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు. 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర రేపు ఇచ్ఛాపురం లో ముగియనుంది. ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరించాలని జగన్ భావిస్తున్నారు. ఈ సభ ద్వారానే జగన్ తన ఎన్నికల కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. పాదయాత్ర ముగింపు సభా వేదికగా.. ఏపికి ప్రత్యేక హోదా కోసం చేపట్టనున్న కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు. దీంతో పాటుగా 2019 ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. టిక్కెట్ల ఖరారు పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన జగన్.. దశల వారీగా పార్టీ అభ్యర్ధులను ప్రకటించనున్నారు. అందులో భాగంగా తొలి లిస్టు ఇచ్ఛాపురం వేదికగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఎప్పుడూ యాత్రల పేరుతో జనాల్లో తిరిగే జగన్.. త్వరలో బస్సు యాత్రకి కూడా శ్రీకారం చుట్టనున్నారు.
ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ అక్కడి నుండి నేరుగా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జెరూసెలం వెళ్లనున్నారు. ఇక వచ్చిన తరువాత వరుసగా జిల్లాల సమీక్షలు నిర్వహించి.. ఎన్నికల కార్యాచరణ ఖరారు చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ నుండి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. దాదాపు ఏపిలోని 45 నుండి 50 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. సాధ్యమైనంత త్వరగా బస్సు యాత్ర పూర్తి చేసి ఆ వెంటనే ఇక ఎన్నికల ప్రచారంలోకి దిగాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే, జగన్ బస్సు యాత్ర ఎక్కడి నుండి ప్రారంభించాలి.. ఎక్కడ ముగించాలనే దాని పై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత అసలు ఎన్నికల రాజకీయం ప్రారంభం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి జగన్ దూకుడు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.