పాపం.. వైసీపీ విశాఖ ఆశలు ఆవిరి?!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి మంచి బలం ఉన్న సంగతి తెలిసిందే. అది జగన్మోహన్ రెడ్డి బలం అనే కన్నా వైఎస్ కుటుంబానికి ఉన్న బలం అని చెప్పుకోవాలి. ఆ బలం కూడా ఈసారి ఎన్నికలలో ఉంటుందా ఉండదా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇక కడప తర్వాత వైసీపీకి బలమైన జిల్లా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాను ఎంచుకున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. రాయలసీమలో ఉమ్మడి కడప జిల్లా తర్వాత విశాఖ జిల్లాను తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావించారు. అందుకే పరిపాలన అక్కడ నుండే చేస్తానని.. మూడు ముక్కల రాజధానిలో ఒక ముక్క మీకే ఇస్తానని విశాఖ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, అవి రెండూ జరగలేదు. అక్కడి వైసీపీ నేతలు కూడా జగన్ మాటలను నమ్మినట్లు లేదు. అందుకే వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

ఈ పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రజారాజ్యం అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవగా.. అందులోనే ఉంటూ వచ్చారు. రాష్ట్రవిభజన అనంతరం కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో  వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. రమేష్ బాబు పార్టీల జంపింగ్ ఎలా ఉన్నా స్థానికంగా ఆయనకు వివాదరహితుడు, అవినీతి మరక లేని మనిషిగా పేరుంది. ఆయనది కాపు సామాజిక వర్గం కావడంతో  వైసీపీ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించింది. మరి ఇప్పుడు అలాంటి సౌమ్యుడే వైసీపీలో ఉండలేక బయటకి వచ్చేయడం ఈ జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

నిజానికి వైసీపీ ఎలాగైనా విశాఖను కంచుకోట చేసుకోవాలని చూస్తున్నది. కానీ మొదట నుండి ఇక్కడి ప్రజలు వైసీపీకి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. విశాఖ నుంచి తొలిసారి జగన్ తల్లి విజయమ్మను ఎంపీగా పోటీ చేయిస్తే ఆమెను ఓడించి ఇంటికి పంపారు. 2019లో అంత పెద్ద జగన్ గాలిలో కూడా విశాఖ సిటీలో నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో కూడా ఇక్కడి ప్రజలు వైసీపీని కాదని టీడీపీ వైపే నిలిచారు. ఈసారి ఎన్నికలలో అయినా ఇక్కడ టీడీపీని దెబ్బతీసి  పుంజుకోవాలని వైసీపీ కలలు కంటోంది. ఆ కల నెరవేర్చుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ లోగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక నా వల్ల కాదని కాడి కింద పడేసి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు తీర్చలేనపుడు, జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యత నన్ను చేయనివ్వనపుడు ఈ పదవి నాకెందుకు అంటూ ఆయన తనదైన స్టైల్ లో గట్టిగానే ఇచ్చి వెళ్లారు.

దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేశాం. విశాఖ జిల్లా వైసీపీకి  జిల్లా అధ్యక్షుడు లేడు. ఏం చేయాలన్నది ఆ జిల్లా పార్టీని పీడిస్తున్న ప్రశ్న. ఇటు సామజిక వర్గాల లెక్కలు కావాలి.. అటు సమర్ధుడైన నాయకుడు కూడా కావాలి. ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయనకు జిల్లా పార్టీని నడిపించే సత్తా లేదని వైసీపీ నేతలకీ తెలుసు. ఒక వైపు సీఎం చెప్పినట్లుగా విశాఖకి రాజధాని రాలేదు.. విశాఖలో శాంతిభద్రతలపై ఎన్నో అనుమానాలు, నగరంలో పెరిగిన క్రైమ్, అసలే తొలి నుండి వైసీపీని నమ్మని విశాఖ జనం, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి నాయకత్వ లోపం.. నేతల మధ్య అంతర్గత పోరు. దీంతో ఈసారి కూడా వైసీపీ విశాఖ ఆశలు గల్లంతైనట్లే భావించాల్సి వస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu