అంతా తూచ్ అన్న ఆర్ధర్... జగన్ అక్షింతలతో మారిన మాట...
posted on Mar 6, 2020 1:10PM
![](/teluguoneUserFiles/img/mla-aurthor-vs-siddharatha-reddy.jpg)
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాల కారణంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన ప్రచారానికి బ్రేక్ పడింది. నందికొట్కూరులో వైసీపీ శ్రేణులు బైరెడ్డి అండ్ ఆర్ధర్ వర్గాలుగా విడిపోవడం... ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో... ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్నే నియమించడంతో ఎమ్మెల్యే ఆర్ధర్ తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. అంతేకాదు, తాను ప్రతిపాదించిన గండ్రెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. దాంతో, ఒకవైపు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలు... మరోవైపు తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేశారు. దాంతో, ఆర్ధర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నవేళ ఆర్ధర్ అసంతృప్తి వెళ్లగగ్గడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే, మీడియా ముందుకొచ్చిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్... తన నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవులు తాను ప్రతిపాదించిన వాళ్లకు రానందుకు బాధ లేదని అన్నారు. అలాగే, పదవులు వచ్చినవారికి కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యమన్న ఎమ్మెల్యే ఆర్ధర్... నందికొట్కూరు నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. తన అనుచరులకు మార్కెట్ కమిటీలో చోటు దక్కనందుకు మనస్తాపానికి గురైన మాట నిజమేనన్న ఎమ్మెల్యే ఆర్ధర్... పదవులు అందరికీ రావంటూ కార్యకర్తలకు నచ్చజెప్పానన్నారు. అయితే, నందికొట్కూరు మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తనకు ...పాలకవర్గం ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందలేదని, దీనిపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు.
బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలపైనా ఎమ్మెల్యే ఆర్ధర్ స్పందించారు. బైరెడ్డితో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిని తాను ఎప్పుడూ విమర్శించలేదని ఆర్ధర్ తెలిపారు. ఇక, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను జిల్లాలో అడుగుపెట్టనీయమని తన అనుచరులు అనలేదని ఆర్ధర్ క్లారిటీ ఇఛ్చారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలుచుకుని, సీఎం జగన్ కు కానుకగా ఇస్తానన్నారు. అయితే, విభేదాలను పక్కనబెట్టి, కలిసి పనిచేయాలంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్షింతలు వేయడంతోనే, బైరెడ్డితో విభేదాలకు ఆర్ధర్ పాజిటివ్ ఎండింగ్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.