హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ట్వీట్ల జోరు.. వైసీపీ మంత్రుల స్పందన దిగజారు!

రాజకీయ అజెండాలను నిర్దేశించి అత్యంత ప్రముఖమైన మాధ్యమం(మీడియా)గా ట్విట్టర్ అవతరించిందనడంలో సందేహం లేదు. రాజకీయ నాయకులు తన అభిప్రాయాలను, భావాలను ప్రజలలో వాయువేగంతా వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ ని వేదిక చేసుకోవడం ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది. అలాగే ఒక రాజకీయ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కూడా ట్విట్టర్ ఒక సాధనంగా మారిపోయింది. సామాజిక మాధ్యమం ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ  ఒక్క ట్వీట్ రాజకీయ నేతల వ్యాఖ్యల్లోని బలాన్ని, డొల్ల తనాన్ని ఇట్టే బయటపెట్టేస్తోంది. ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయం పెను వివాదం సృష్టించింది.

రాజకీయ, సామాజిక, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ట్విట్లర్ వేదికగా తమ స్పందనను తెలియ జేశారు.  ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో వైసీపీ నేతల సమర్థన ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ట్రోల్ అవుతున్నాయి. ఎలాంటి హేతుబద్ధతా లేని ఆ సమర్థింపు వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మంత్రుల లోకజ్ణానమిదేనా అని నిలదీస్తున్నారు.అయితే ఒకే ఒక్క ట్వీట్ జగన్ సర్కార్ నిర్ణయంలోని ఔచిత్యాన్ని నిలదీసింది, నిగ్గదీసి అడిగింది. కడిగి పారేసింది. బదులివ్వనేనంతగా కార్నర్ చేసేసింది. అదే హిందుపురం ఎమ్మెల్యే, నందమూరు తారకరామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్. రాజకీయ నాయకుడిగా మారిన బాలకృష్ణ సినిమాలు పంచ్ డైలాగులకు, భారీ యాక్షన్ డ్రామాకు పెట్టింది పేరు. ఆయన ఇంత వరకూ ఎన్నికల ప్రచారంలో తప్ప విడిగా ఎక్కడా బయట పెద్దగా ప్రసంగాలు చేసింది లేదు. అలాగే సామాజిక మాధ్యమంలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నదీ లేదు. కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఆయన స్పందించిన తీరు మాత్రం మహామహా రాజకీయ వేత్తలను సైతం సంభ్రమాశ్చర్యలకు గురి చేసింది.

సినిమా షూటింగ్ కోసం ఆయన విదేశాలలో ఉండటంతో నేరుగా స్పందించే అవకాశం లేకపోవడంతో ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును ఖండిస్తూ బాలయ్య చేసిన ట్వీట్ అధికార వైసీపీ కాళ్ల కింద నేతను కదిపేసింది. జగన్ నిర్ణయంలోని డొల్ల తనాన్ని, రాజకీయ దివాళాకోరు తనాన్ని వెల్లడించింది. ఈ విషయంపై అనుకూల వాదనే తప్ప ప్రతికూల వాదనలకు అవకాశమే లేని కచ్చితత్వం ఈ ట్వీట్ ద్వారా వచ్చింది. వైసీపీలోనే ఎన్టీఆర్ హెల్త వర్సిటీ పేరు మార్పు నిర్ణయం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతకు ఈ ట్వీట్ బలాన్నిచ్చింది.  ఇక వైసీపీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మంత్రులు  రోజా, విడదల రజనీ, తదితరులు చేసిన ట్వీట్లు కానీ, కర్రా విరగొద్దు, పామూ చావద్దు అన్నట్లుగా బీజేపీ నాయకుడు జీవీఎల్ చేసిన ట్వీట్ కానీ ట్రోలింగ్ కు గురి కావడం వినా సాధించిందేమీ లేదు. 

న్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తప్పుపడుతున్నాయి. సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న సంకుచితత్వంతో ఒక యుగపురుషుడిని అవమానించేందుకు చేసిన దుస్సాహసంగా అభివర్ణిస్తున్నాయి. అయితే బాలకృష్ణ ట్వీట్ కు కౌంటర్ గా కొందరు రాష్ట్ర మంత్రులు చేసిన ట్వీట్ లను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భిక్ష పొంది..  ఇప్పుడు ఆ మహానుభావుడి పేరు మార్పును సమర్ధించడం.. పదవి కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారే వారి మనస్తత్వాన్ని ఎత్తి చూపుతోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. 

‘మార్చేయడానికీ, తీసేయడానికీ  ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి  వెన్నెముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు కొడుకు గద్దెనెక్కి హెల్త్ వర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచ భూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’అంటూ బాలకృష్ణ చేసిన ట్వీట్ లో రాజకీయ ప్రస్తావన కంటే ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నదే ప్రధానంగా ఉటంకించారు. రాజకీయాలతో సంబంధం లేకండా తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా నిలువెత్తు తేజోమయ మూర్తిగా ఎన్టీఆర్ కు జనం గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నది చెప్పారు.  అయితే హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని సమర్ధిస్తూ బాలయ్య సినిమాలోని డైలాగులతో రోజా చేసిన ట్వీట్ ఖాళీ డబ్బాలో గులకరాళ్ల మాదిరిగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏ పర్యటనకు వెళ్లినా రహదారులకు పరదాలు కప్పుకుని జనానికి మొహం చాటేసే జగన్ ను గన్ అనడమేమిటని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక విడదల రజనీ ట్వీట్ విషయానికి వస్తే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులను ఎలుకలు కొరికిన సంఘటన ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా అని నిలదీస్తున్నారు. ఇక మరో మంత్రి కారుమూరి వ్యాఖ్యలు కూడా ఆడ లేక మద్దెలు ఓడు సామెతనే గుర్తుకు తెస్తున్నాయంటున్నారు. ఆరోగ్య శ్రీ వైఎస్సార్ అనడానికి ఇదేం సందర్భం అని నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కంటే ఎంతో ముందుగానే దార్శనికతతో ఆలోచించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని స్థాపించారని వారు గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చిన ఆరోగ్య శ్రీతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని పోల్చడం దిగజారుడుతనానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహరావు అయితే కర్రా విరగొద్దు, పామూ చావోద్దు అన్నట్లుగా స్పందించారని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.  ఒక వైపు బీజేపీ నేతలంతా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై నిప్పులు చెరుగుతుంటే.. జీవీఎల్ మాత్రం ఎవరి మెప్పు కోసం అటూ ఇటూ కాని ధోరణి అవలంబిస్తున్నారని నిలదీస్తున్నారు.