కుప్పం వైసీపీలో డిష్యుం..డిష్యుం.. రక్తమోడిన విభేదాలు
posted on Sep 1, 2022 4:46PM
సినిమాలో హీరో విలన్ వర్గాలు కొట్టుకుంటారు, వీధిలో రెండు వర్గాలవారు కొట్టుకుంటారు. ఒక్క వైసీపీలోనే వాళ్లలో వాళ్లు కొట్టుకుంటున్నారు. అయితే వైసీపీలో ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఇదేమీ పెద్ద వింత కాదు. ఈ మధ్యనే అనంతపురంలో పోలీసుల సమక్షంలో ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వైసీపీకి చెందిన రెండు వర్గాలు వారు కొట్టుకున్నారు. పోలీసులు అలా సినిమా చూసినట్టు చూస్తూనే ఉన్నారు. ఎవరినీ నిలువరించడానికి వీలు కాలేదు. అంతా అయ్యాక కేసు రాసుకుని వదిలించుకున్నారు. ఇపుడు తాజాగా మరో కోట్లాట సీన్ తెర మీదకు వచ్చింది.
ఇది ఏకంగా టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగింది. విపక్షానికి చెందిన నియోజకవర్గంలో అధి కార పార్టీ, విపక్ష వర్గీయుల మధ్య గొడవలో, కొట్లాటో ఉంటాయని అనుకుంటారు. కానీ అధికార వైసీపీ పక్షం వారి మధ్యనే గొడవ జరిగింది. ఈ సంఘటనకు ముందు మూడు రోజుల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులుశతథా ప్రయత్నించాయి.
అది అలా ఉంటే.. ఇప్పుడు కుప్పంలో వైసీపీలోనే వర్గపోరు రోడ్డున పడింది. ఇందుకు మూలం ఇటీవల వైసీపీ నియోజకవర్గ సమీక్షలో కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగాఎమ్మెల్సీ భరత్ కుమార్ సీఎం జగన్ ప్రకటించేశారు. అక్కడితో ఆగకుండా.. ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ప్రకటించారు. ఇదంతా వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం. అయితే రెండేళ్ల ముందే కుప్పం అభ్యర్థిని జగన్ ప్రకటించిన వ్యూహం వికటించింది. కుప్పంలో భరత్ వ్యతిరేక వర్గంలో ఈ ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది.
ఈ నేపథ్యంలోనే భరత్ పీఏ మురుగేశన్, వైస్ ఛైర్మన్ మునుస్వామి మధ్య గొడవ జరిగింది. బాబాబాహీ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో మురుగేశన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి నయానో భయానో నియోజక వర్గ ప్రజలను లొంగదీసుకోవాల చూస్తున్నారని వైసీపీ నాయకులు తెలుగుదేశం పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ వైసీపీ విమర్శిస్తోంది. వాటికి భిన్నంగా గురువారం అధికార పార్టీ ఎమ్మెల్సీ భరత్ పిఏ మురుగున్‌పై వైసీపీ వర్గీయులే దాడి చేయడంతో ఆ పార్టీ పరువు అమాంతం గంగలో కలిసింది. భరత్‌కి టికెట్ ప్రకటించిన ప్పటి నుంచి కుప్పంలో అనేకమంది పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనడానికి ఈ సంఘటనే సాక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.