ఎంపి భరత్ ఆధ్వర్యంలో అమరావతి రైతులపై దాడి
posted on Oct 18, 2022 11:04PM
శాంతియుతంగా మహాపాదయాత్ర సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. మహాపాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ వైసీపీలో ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే యాత్రను ఆపడానికి అన్ని విలువలనూ తుంగలోకి తొక్కి రౌడీమూకల్లా రెచ్చిపోతున్నారు. దాడికి పాల్పడడానికి వెనుకాడటం లేదు. పెట్రోలు చల్లైనా సరే రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో అదే జరిగింది. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ఎంపీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు రౌడీ మూకల్లా వ్యవహరించాయి.
పాదయాత్ర దారిలో సభ ఏర్పాటు చేసిన రాజమండ్రి ఎంపీ ఎంపీ భరత్ రెండు మూడు వందల మందిని సమీకరించి పాదయాత్రలో ఉన్న రైతులపై దాడి చేయించారు. అసలు రైతుల మహాపాదయాత్ర రాజమండ్రి చేరడంతోనే కవ్వింపులకు దిగిన వైసీపీ శ్రేణులు రైతులపైకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. వారిని ఎంపీ భరత్ ప్రోత్సహించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు మహాపాదయాత్ర జరుగుతున్న మార్గంలో నడి రోడ్డు మీద సభకు పోలీసులు ఎలా ఎందుకు అనుమతించారో అర్థం కావడంలేదని స్థానికులే విస్తుపోతున్నారు
.వైసీపీ దాడులు జరిపినా రైతులు మొక్కవోని ధైర్యంతో యాత్ర కొనసాగించారు. ప్రజలు రైతులకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. ఇంత బహిరంగంగా ఎంపీ పర్యవేక్షణలో రైతులపై దాడి జరిగినా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.