కేసీఆర్ ప్రభుత్వానికి వైకాపా అంశాల వారి మద్దతు!

 

ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలకు మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి చాలా సార్లు ప్రశ్నించినా దానికి వారిరువురు నుండి సమాధానం రాలేదు. ఆ తరువాత మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనగా, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఘనవిజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అంతేకాదు..జగనేమీ అంటరానివాడు కాదని, అతనితో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అన్నారు.

 

కేసీఆర్ రాష్ట్ర విభజన కోసం పోరాడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి. కనుక సహజంగానే కేసీఆర్ కి బద్ద విరోధిగా పరిగణింపబడి ఉండాలి. కానీ వారిరువురూ నేటికీ మంచి మిత్రులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వారిరువురూ ఒకరినొకరు ఎన్నడూ విమర్శించుకోలేదు. ఒకరి దారికి మరొకరు అడ్డు తగలలేదు. చివరికి ఇప్పుడు పోలవరం ముంపు గ్రామాల విషయంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ని పల్లెత్తుమాటనలేదు.

 

కొద్ది రోజుల క్రితం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటిస్తే, ఈరోజు వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడిన నెల్లూరు యంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైకాపా కేసీఆర్ ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తుందని కేసీఆర్ అడగక ముందే ప్రకటించడం విశేషం.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్నచంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు సిద్దమని పదేపదే చెపుతున్నప్పటికీ, కేసీఆర్ ఆయనపై కత్తులు దూస్తూన్నారు. జగన్ తో మాత్రం దోస్తీకి సై అంటున్నారు. ఇంతకాలంగా  ఆంధ్రా ప్రజలను కేసీఆర్ అనరాని మాటలు అంటున్నా, వారిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తానని అవమానకరంగా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. పైగా ఇప్పుడు ఆయన అడగక మునుపే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తూర్పుపడమర వంటి వీరిరువురు, రాష్ట్రాలు, పార్టీలు, సిద్దాంతాలు అన్నీ వేరయినా కూడా ఒకరికొకరు ఇంత గొప్పగా అభిమానించుకోవడం, సహకరించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వారిరువురి స్నేహం నేటికీ ఒక మిష్టరీగానే మిగిలిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu