సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత
posted on Dec 22, 2015 5:13PM

సినిమా రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ (69) మంగళవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణానికి రైలులో ప్రయాణిస్తూ వుండగా ఖమ్మం సమీపంలో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం రైల్వే పోలీసులు కాశీ విశ్వనాథ్ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష అనంతరం ఆయన కుమారుడు శ్రీధర్‌కి అప్పగించారు. కాశీ విశ్వనాథ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, నవల, సినిమా మాటల రచయిత, రంగస్థల దర్శకుడు, నటుడుగా ప్రశంసనీయమైన కృషి చేశారు. ఆయన 122 కథలు, 28 నవలలు, 43 నాటికలు రాశారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’ తదితర చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ‘కాశీపట్నం చూడరబాబు’ అనే కాలమ్ కూడా రాశారు.