వేధిస్తున్నాడని యువకుడికి నిప్పెట్టిన యువతి

యువతులపై ప్రేమోన్మాదంతో యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు, హత్యాయత్నాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఒక యువతి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో ఒక మహిళ తనను మానసికంగా వేధస్తున్నాడంటూ ఒక యువకుడిపై ప్రతీకారానికి దిగింది. చిరంజీవి అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఓ యువతి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో తమ్మిశెట్టి చిరంజీవి (35)పై దేవళ్ళ శ్రీలక్ష్మి (30) పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో యువకుడి వీపు కాలిపోవడంతో స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన యువతిపై బాధితుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 గ్రామానికి చెందిన చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తన వ్యక్తిత్వంపై నిందలు వేస్తున్నాడని శ్రీలక్ష్మీ వాపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి తన ధోరణిని మార్చుకోకపోవడంతో అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఆ మహిళ. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిరంజీవి కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పివేసి అతడిని హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన యువతిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు.. చిరంజీవి, శ్రీలక్ష్మీ మధ్య గొడవ ఏంటి.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టేంత వివాదం ఏంటి.. మహిళ గురించి చిరంజీవి ఏ విధమైన ప్రచారం చేశాడనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే చిరంజీవిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

Related Segment News