కేసీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? బీజేపీ కాపాడుతుందా?

తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత రాజ‌కీయ ముఖచిత్రం మార‌బోతుందా?  సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో బీఆర్ ఎస్ అధినేత‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా? ఆయ‌న జైలుకు  వెళ్లే అవ‌కాశాలున్నాయా? మ‌రి కేసీఆర్ ను కాపాడేదెవ‌రు..?  రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంత‌కీ.. ఉన్న‌ట్లుండి ఈ ప్ర‌శ్న‌లు  ఉత్ప‌న్న‌ం కావడానికి  కార‌ణం కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని అధికారంలోకి రాక‌ముందు నుంచే  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌న దృష్టిని కేంద్రీక‌రించారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాలు ఫాలో అయిన‌వారికి ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో కాళేశ్వ‌రం, దాని ప‌రిధిలోని మేడిగ‌డ్డ, త‌దిత‌ర బ్యారేజీల‌పై చ‌ర్చ‌పెట్టిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ను కార్న‌ర్ చేసింది. 

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో 1.81ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మించిన‌  ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌న్నీ ప్ర‌మాదంలో ఉన్నాయి. వీటిలో ఇప్ప‌టికే మేడిగ‌డ్డ తీవ్రంగా దెబ్బ‌తింద‌ని, మ‌రో రెండు బ్యారేజీలు ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని, దీనికి కార‌ణం అవినీతికి పాల్ప‌డి నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించ‌క పోవ‌టంమేన‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రంలో పేర్కొంది. మొత్తానికి కాగ్  నివేదిక, విజిలెన్స్ రిపోర్టు, కృష్ణా ప్రాజెక్టుల ప‌రంగా తెలంగాణ‌కు గ‌త ప్ర‌భుత్వం ఎలా అన్యాయం చేసింద‌నే విష‌యాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రంలో వివ‌రించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ప్రాజెక్టుల్లో అవినీతిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపిస్తామ‌ని, బాధ్య‌తల‌పై క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అసెంబ్లీలో  ప్రకటించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే  ఓ క్లారిటీ వ‌చ్చార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచార‌ణ అనంత‌రం పూర్తిస్థాయి నివేదిక‌ల ఆధారంగా గ‌త పాల‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇదే జ‌రిగితే సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవినీతిపై సీఎం రేవంత్  మరింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో మాజీ సీఎం కేసీఆర్ పై చ‌ర్య‌లు తీసుకుంటే ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంద‌ని, త‌ద్వారా ఎన్నిక‌ల స‌మయంలో బీఆర్ ఎస్ కు ఏదో ఒక మేరకు మేలు జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఎన్నిక‌ల త‌రువాత  కేసీఆర్ తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవినీతిలో భాగ‌స్వాములుగా ఉన్న‌వారిపైనా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ కు మెరుగైన ఫ‌లితాలు రాకుంటే కేసీఆర్ జైలుకు   వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే  రేవంత్ రెడ్డి నుంచి ముంచుకొచ్చే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌, బీఆర్ ఎస్ నేత‌లు బీజేపీవైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందే బీజేపీతో చెలిమి మొద‌లు పెడితే కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పొచ్చ‌ని కేసీఆర్  భావిస్తున్నార‌ని స‌మాచారం. 

బీజేపీతో ఇన్నాళ్లు ఢీఅంటే ఢీ అన్న మాజీ సీఎం కేసీఆర్‌.. బీజేపీతో స్నేహాన్ని కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు బీఆర్ ఎస్ వ‌ర్గాల స‌మాచారం. అయితే, రాష్ట్రం, ఢిల్లీ స్థాయిలోని కాషాయ పార్టీ నేత‌లు బీఆర్ ఎస్ తో పొత్తుకు నో చెప్పేస్తున్నారు. అమిత్ షా, జేపీన‌డ్డాలు మాత్రం ఆలోచిద్దామ‌ని పేర్కొన్న‌ట్లు తెలిసింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ‌తో మాజీ సీఎం కేసీఆర్‌, ఆయ‌న అనుచ‌రుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగితే.. సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu