దాడి జరిగితే చూద్దాం.. ఫిర్యాదు ఎందుకు చేశారు.. పవన్ కు పోలీసుల నోటీసు
posted on Oct 5, 2023 11:11AM
ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. భరోసా ఇవ్వాల్సిన పోలీసులు ఫిర్యాదు దారుడికే నోటీసులు ఇస్తున్నారు. భద్రత కల్పించాల్సిన వారు.. మీకు భద్రత ఎందుకు కల్పించాలో చెప్పండంటూ నిలదీస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ స్పష్టమైన సంకేతాలు చూపి మరీ భద్రత కోరితే.. ఆ ఆధారాలు చాలవు.. ముందు దాడి జరగనివ్వండి తరువాత చూద్దాం అంటున్నారు. ఏపీలో పోలీసులు విపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరిది.
పోనీ దాడి జరిగిన తరువాతైనా బాధితులవైపు నిలబడతారా అంటే అదీ లేదు. బాధితులపైనే కేసులు. నిరసన తెలపడంలో దాడులు ఒక భాగమంటూ భాష్యాలు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా లేదు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా పెడనలో తనపై దాడి జరిగే అవకాశాలున్నాయనీ, ఇందుకు సంబంధించి తన వద్ద విశ్వసనీయ సమాచారముందనీ భద్రత కల్పించాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకోగానే పోలీసులు చేయాల్సిన పని భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం, దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం, దాడులు చేస్తారన్న అనుమానం ఉన్న వారిని అదుపులోనికి తీసుకోవడమో, నియంత్రించడమో చేయాలి. కానీ మన పోలీసులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. అసలు మీ మీద దాడి జరుగుతుందని భావించడానికి ఉన్న ఆధారాలేమిటో చూపండి అంటూ పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.
ఇంతకీ పవన్ కల్యాణ్ తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. అధికార పార్టీకి చెందిన వారే పెడనలో అసాంఘిక శక్తులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఠాట్ అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడమేమిటని పోలీసులకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే రివర్స్ లో పవన్ కల్యాణ్ కు ఆధారాలు చూపడం అంటూ నోటీసులు ఇచ్చారు.
అధికార పార్టీ విపక్షాలపై, విపక్ష నేతలపై, కార్యకర్తలపై, వారి కార్యాలయాలపై దాడులు జరపడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే జోగి రమేష్.. (ఆయన ఇప్పుడు మంత్రి) ఆధ్వర్యంలో జరిగిన దాడి, అంతకు ముందు, ఆ తరువాత విపక్షాలపై జరిగిన దాడుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ఫిర్యాదుకు వేరే ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు. పైపెచ్చు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి నేతృత్వం వహించి మంత్రిగా ప్రమోషన్ పొందిన జోగి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పెడన. అటువంటి పెడనలో తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేస్తే.. ఆ అవకాశాలపై ఆధారాలివ్వండి అంటూ పోలీసులు పవన్ కల్యాణ్ కు ఎదురు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మందికి కాదంటూ జనసేనానికి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హితవచనాలు చెప్పారు.
ముందు దాడి జరగనివ్వండి.. ఆ తరువాత ఫిర్యాదు చేయండి అన్నదే ఆయన హిత వచనాల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ పోలీసులు అధికార పార్టీకి చెందిన వారి ఫిర్యాదులు తప్ప మరెవరి ఫిర్యాదులూ పట్టించుకోరనీ, అందుకే దాడులు చేసి.. దాడికి గురైన వారిపై వైసీపీ మూకలు ఇస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారనీ అంటున్నారు. అంతే తప్ప.. దాడి జరగకుండా తాము భద్రత కల్పిస్తామన్న భరోసా మాత్రం విపక్షాలకు ఇవ్వడానికి ఏపీ పోలీసులుర రెడీగా లేరు. దాడి జరుగుతుందనడానికి ఆధారం చూపమంటూ తామిచ్చిన నోటీసుకు పవన్ కల్యాణ్ నుంచి సమాధానం రాలేదని పేర్కొంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కల్యాణ్ కు మళ్లీ నోటీసులు ఇచ్చారు.
సరే చివరకు జరిగిందేమిటంటే.. పెడనలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తొలగించారు. ఆ సందర్భంగా జనసేన, వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కౌన్సిలర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగళ్లు, భీమవరం, మాచర్ల ,నందిగామ, కుప్పం సహా పలు ప్రాంతాలలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులకు పాల్పడింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకుని తరువాత వదిలేయడం, దాడికి గురైన వారిపై మాత్రం హత్యాయత్నం సహా తీవ్రమైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం అన్నది ఏపీ పోలీసులకు రివాజుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.