లోగుట్టు పెరుమాళ్ళకెరుక.. గల్ఫ్ లో జుల్ఫీ చేసే పనేంటి?
posted on Mar 3, 2020 7:59AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత తొమ్మిది నెలలలో కొన్నివేల రహస్య జీవోలు విడుదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉందనుకుంటుంటే వాటిని రహస్యంగా ఉంచడం ప్రతి ప్రభుత్వం చేసే పనే అయినా జగన్ ప్రభుత్వం ఇందులో ఎప్పుడో పరిధులు దాటేసింది.
అయితే, గత ఏడాది నవంబర్ 13వ తేదీన విడుదల చేసిన ఒక రహస్య జీవో వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఆ జీవో ఆర్ టీ 2561 ప్రకారం ఏపీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలను కవర్ చేసేలా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఓ వ్యక్తిని మిడిల్ ఈస్ట్‌కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఆయన పేరు జుల్ఫీ రవ్‌డిజీ. ఆయనెవరో సామాన్యులెవరికీ తెలియదు కానీ ఆయనకు ఏపీలో ఉన్న మంత్రులకు ఉండే అధికారాలన్నీ కట్టబెడుతూ పదవి ఇచ్చారు.
ఒక్క ఈయనే కాదు.. గల్ఫ్ దేశాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించి చాలా మందికి పదవులను పంచి పెట్టింది. వాళ్లందరికీ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ జుల్ఫీ రవ్‌డిజీ అనే వ్యక్తి మాత్రం అటు ఏపీ ప్రజలకే కాదు ప్రముఖులకు.. ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులకు కూడా తెలియదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన ఆ రహస్య జీవోలో అయినా చెప్పారా అంటే అది కూడా ఎక్కడా ఒక్క ముక్క కూడా లేదు.
ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఆయనను నియమించడానికి గల కారణాలేమిటి? అయన నిర్వహించాల్సిన విధులు ఏంటి? అయన ఆయా దేశాలలో ఎవరెవరిని కలుస్తారు? ఏ బాధ్యతలను నిర్వర్తిస్తారు? అన్న విషయాలేమీ ఆ జీవోలో లేవు. కేవలం క్యాబినెట్ ర్యాంక్ అధికారాలతో పాటు అదే స్థాయిలో ఇచ్చే జీతభత్యాల వివరాలు మాత్రమె ఇచ్చారు.
అయితే, ఈ జీవో ఇప్పుడు బయటపడగానే రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. గత ఏడాది జులై నెలలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ అరెస్ట్ జరిగిన మూడు నెలలకు జీవో విడుదల జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసి అయిన ఆ వ్యక్తి కూడా గల్ఫ్ దేశాలలోనే విధులను నిర్వర్తించనున్నారు.
ఇప్పటికి ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించి ఆరు నెలల కాలం జరగగా ఈ సమయంలో అయన ఎవరిని కలిశారు.. ఏపీకి ఏం ప్రయోజనం సమకూర్చారు? అన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే అసలు గత ఆరు నెలలుగా రహస్యంగా ఉన్న జీవోను ఇప్పుడు ఎందుకు బయటకు తెచ్చారు? ప్రభుత్వంలోని వ్యక్తులే బయటపెట్టారా? దానివెనుక ఉన్న మతలబు ఏంటో అన్నది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉండగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షం నిమ్మగడ్డ ఇప్పటికే అరస్టైన రస్ అల్ ఖైమా కేసుతో ఈ జీఓ ముడిపెడుతూ ఆ కేసుకు సంబంధించి వ్యవహారం నడిపెందుకే జుల్ఫీ ని నియమించుకున్నారని, అందుకే ఈ జీఓ రహస్యంగా ఉంచారని డంకా భజాయించి మరీ చెప్తోంది.

