నాలుక రంగును బట్టి జబ్బులను గెస్ చేయవచ్చు తెలుసా?
posted on Aug 6, 2024 9:30AM
ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్ చేసే కొన్ని ప్రాథమిక పనులు ఉంటాయి. వాటిలో మొదటిది నాలుక చూడటం. నాలుక చూడటం, కళ్లు.. ముఖ్యంగా కనుగుడ్డు కింది భాగం, తరువాత మణికట్టు పట్టుకుని నాడి చూడటం వంటివి చేస్తారు. అయితే డాక్టర్లు ఇలా నాలుక చూడటం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. నాలుక రంగును బట్టి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చెప్పవచ్చు. అసలు నాలుక ఏ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు? ఎలాంటి రంగులు ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తాయి? తెలుసుకుంటే..
నాలుక రంగు..
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక గులాబీ కలర్ లో ఉంటుంది. ఇలా గులాబీ రంగులో కాకుండా వేరే ఇతర రంగులలో నాలుక ఉంటే వాటి వెనుక కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి.
నలుపు రంగు..
కొన్నిసార్లు నాలుక రంగు నల్లగా మారవచ్చు. నాలుక నలుపు రంగుగా మారడం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధికి సంకేతమట. నలుపు రంగు నాలుక ఫంగస్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తెలుపు రంగు..
కొందరికి నాలుక తెల్లగా పాలిపోయి ఉంటుంది. నాలుక రంగు తెల్లగా మారినట్లయితే శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది కాకుండా, తెల్లటి నాలుక ల్యుకోప్లాకియా వంటి తీవ్రమైన వ్యాధిని కూడా సూచిస్తుందట.
పసుపు రంగు..
నాలుక పసుపు రంగులోకి మారుతుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ ఇది నిజమే. కొందరికి కొన్ని పరిస్థితులలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది. నాలుక పసుపు రంగులో ఉన్నట్టైతే జీర్ణక్రియను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. నోటిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఈ రంగు నాలుక కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా సూచిస్తుందట.
ఎరుపు రంగు..
నాలుక ఎర్రగా పొక్కినట్టు ఉంటుంది కొందరికి. ఇలా ఎరుపు రంగులో నాలుక ఉండటం విటమిన్ B, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులో ఉంటుంది. నాలుక రంగు మారడాన్ని మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.