గడువు ముగిసే అసెంబ్లీకి కొత్త నియామకాలు.. జగన్ ప్లానేంటి?

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధమే కాని పరిస్థితి. ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. కొత్త జీవోలు.. వింత వింత పాలసీలు తెచ్చే జగన్ వాటితో ప్రయోజనం ఏంటన్నది కూడా ఎవరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఇప్పటికే ఇలాంటి షాకులు ఎన్నో ఇచ్చిన జగన్ తాజాగా అలాంటిదే మరో షాక్ ఇచ్చారు. అదేమంటే.. ఏపీ అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ కొత్త నియామ‌కాలు చేపట్టారు. స‌భా హ‌క్కుల క‌మిటీ పేరిట కొత్తగా కొందరు ఎమ్మెల్యేల‌కు పోస్టులు ఇచ్చారు. ఈ క‌మిటీకి చైర్మ‌న్‌గా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిని నియ‌మించగా.. ఇందులో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఓ టీడీపీ ఎమ్మెల్యేకు కూడా స్థానం కల్పించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి స్థానం కల్పించాలనే నిబంధన మేరకు టీడీపీ ఎమ్మెల్యేని కూడా కలుపుకున్నారు.

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో ఇత‌ర స‌భ్యులుగా బ్రాహ్మ‌ణ‌ సామాజికవర్గానికి చెందిన బాప‌ట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎస్సీ సామజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్సీ సామజిక వర్గానికి చెందిన సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, క‌మ్మ‌ నియోజకవర్గానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కొప్పుల వెలమ సామజిక వర్గానికి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు, బీసీ సామజిక వర్గానికి చెందిన టీడీపీ బీసీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. మొత్తం ఏడుగురు స‌భ్యుల‌తో ఈ క‌మిటీని నియ‌మించగా.. వీరికి అసెంబ్లీలోనే కార్యాల‌యం కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఇప్పటికే జీవో కూడా ఇచ్చేశారు.

అయితే.. త్వ‌ర‌లోనే ముగిసిపోనున్న అసెంబ్లీకి ఇప్పుడు కొత్త‌గా నియామ‌కాలు చేప‌ట్ట‌డం ఏంట‌నేది రాజకీయ వర్గాలలో తలెత్తుతున్న ప్ర‌శ్న‌. నిజానికి   మ‌రో 8 నెలలే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమయం ఉంది. ఒకవైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. అసెంబ్లీ గడువు కూడా ముగిసిపోతున్నది. కనుక ఇక అసెంబ్లీతో పని కూడా తక్కువే. రాబోయే ఎనిమిది నెలల్లో మహా అయితే మ‌రో మూడు సార్లు మాత్ర‌మే అసెంబ్లీ భేటీ ఉండే అవ‌కాశం ఉంది. అది కూడా ఒకటి వ‌ర్షాకాల స‌మావేశాలు, రెండు శీతాకాల స‌మావేశాలు, చివరగా వ‌చ్చే ఏడాది ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ కోసం జ‌రిగే సమావేశాలు. అవి కూడా మొత్తం మూడు నుంచి నాలుగు రోజులు మాత్ర‌మే జ‌ర‌గే అవ‌కాశం ఉంది. 

నిజానికి ఎన్నికలంటే అధికార పార్టీల కంటే ప్రతిపక్ష పార్టీలు దూకుడు మీద ఉంటాయి. ఈ సమయంలో అధికార పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టే పని పెట్టుకుంటాయి. కనుక అధికార పార్టీ అసెంబ్లీ సమావేశాలను సాధ్యమైనంత వరకు కుదించుకోవాలని చూస్తుంది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఉంది. కానీ, ఇలాంటి సమయంలో అసెంబ్లీలో ఇప్పుడు స‌భా హ‌క్కుల క‌మిటీ పేరిట ఎమ్మెల్యేల‌కు పోస్టులు ఇవ్వడం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. కేవలం సామాజిక వర్గాల వారీగా సమన్యాయం మా సిద్ధాంతం అని చెప్పుకొనేందుకు, ఎమ్మెల్యేలకు పదవుల కోసమే జగన్ ఈ నియామకం చెప్పట్టారా? లేక ఈ కమిటీ వెనక ఉద్దేశ్యం మరేమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా  అసెంబ్లీ సమావేశాలు మొదలైతే నేఈ కమిటీ ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టం అయ్యే ఛాన్స్ ఉంటుంది.