ఈ జగన్ కు ఏమైంది?

మడమ తిప్పని, మాట తప్పని నేతగా తనని  తాను బ్రాండ్ గా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బ్రాండింగ్ క్రమంగా మసకబారుతోంది. అసలుజగన్ అంటేనే ధైర్యం, ధైర్యం అంటేనే జగన్ అంటూ విపరీతమైన ఫాలోయింగ్  సొంతం చేసుకున్న జగన్  ఇటీవలి కాలంలో ఆయనను అభిమానించే వారిని తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ స్థాపించిన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చిన్న విషయం కాదు.  11 కేసులలో 16నెలల జైలు జీవితం గడిపి కూడా ప్రజామోదం పొందడం ఒక్క జగన్ కే సాధ్యమైంది. జగన్ తెగువను, పట్టుదలను  ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాలి. అయితే ఇంత బలమైన వ్యక్తిత్వం ఉన్న జగన్ ఇటీవల జావకారిపోతున్నారు. సీఎం పదవిని చేపట్టిన మొదటి సంవత్సరం విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రతిపక్షానికి 23 స్థానాలే వచ్చిన విషయాన్ని దెప్పిపొడుస్తూ గడిపేశారు జగన్. రోండవ సంవత్సరం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా ప్రయోగించి చంద్రబాబుకు కంట్లో నలుసుగా మారాను జగన్. ఇక మూడో సంవత్సరం తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను పార్టీ నుండి సాగనంపే పనిని జగన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక నాలుగో సంవత్సరం అంతా ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టే పనికి తన అనుయాయులతో కలిసి పదును పెట్టారు.  చంద్రబాబు ధర్మపత్నిని అసెంబ్లీలో నానా మాటలూ అని ప్రతిపక్ష నేత చేత  అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేయించగలిగారు.  గడిచిన నాలుగేళ్లూ స్విచ్ లు నొక్కుతూ, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూ, సంక్షేమం పేరుతో పైసలు పంచుతూ కాలం గడిపిన జగన్ కు చివరి సంవత్సరం కఠిన పరీక్షలు పెడుతోంది. 2019 ఎన్నికల ముందడు జరిగిన కోడి కత్తి కేసు, వివేకా హత్య వంటి సంఘటనలు జగన్ కు గుది బండగా మారాయి. ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి పనులు చక్కపెడుతున్నా.. సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అన్న అనుమానం జగన్కు కలగలేదని చెప్పాలి. ఢిల్లీలో ప్రతిభావంతులైన నాయకులకు బాధ్యతలు ఇచ్చిన జగన్ ప్రధాని కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా జగన్  అంచనాలకు అందకుండా ఢిల్లీలో పరిణామాలు జరుగుతున్నాయి అనే అనుమానం ఆయన పార్టీ నేతల్లో బలపడుతోంది.

ప్రస్తుతం జగన్ పరిస్థితికి.. ఇంత కాలం దేన్నీ సీరియస్ గా తీసుకోలేకపోవడమే కారణమని ఈ పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీని మరింత డిఫెన్స్ లోకి నెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండం కాదని బయటకు ఎంత చెప్పుకున్నా పార్టీలో డల్లతనాన్ని ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ పరువు బజారున పడటంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అసమ్మతి నేతలంటూ నలుగురిని బయటకు పంపించి పార్టీ చేతులు దులుపుకుంది.  తాజాగా కోడి కత్తి వివాదంలో ఎన్ఐఏ రిపోర్టు జగన్ ను, పార్టీని ఇబ్బంది పెట్టగా, వివేకా హత్య కేసు జగన్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్ విసిరింది. అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగియడంతో జగన్ ఇబ్బందులు పెరిగాయి. దీంతో అనంతపురం సభను, లండన్ పర్యటనను సైతం జగన్ రద్దు చేసుకున్నారు.  మైసూరు నుంచి ఆఘమేఘాల మీద లాబీయిస్టులు విజయవాడలో వాలిపోయారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న వాస్తవం జగన్ కు బాగా తెలుసు. 

ఇదిలా ఉంటే అసలు భయమన్నదే ఎరుగని జగన్ కు పరిస్థితులు భయాన్ని పరిచయం చేశాయని విశ్లేషకులు అంటున్నారు.  చివరి సంవత్సరం గడ్డు కాలంగానే ఉంటుందన్నది ఇప్పటికే జగన్ కు అర్ధం అయి ఉండాలి. 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పెద్ద బాధ్యతకు జగన్ సిద్ధం కావాల్సి ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu