వ్యవసాయ మోటార్లకు మీటర్లు సరే.. ఈ సంగతేంటి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకు పడే అంశాలలో ప్రధానమైనది వ్యవసాయ మీటర్లకు కేంద్రం మోటార్లు పెట్టమంటోందన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ విస్పష్టంగా చెబుతున్నారు. తాను కేంద్రం ఆదేశాలను ధిక్కరించినందుకే అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నదనీ, పనికిమాలిన కొర్రీలతో అప్పులకు అడ్డంకులు సృష్టిస్తే రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తోందని కేసీఆర్ చెబుతున్నారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్ కూ లేని ఆంక్షలను తెలంగాణకు విధిస్తూ నానా ఇబ్బందులూ పెడుతోందని విమర్శిస్తున్నారు. తన తల తీసేసినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పనికి తాను అంగీకరించేది లేదని చెబుతున్నారు. అదలా ఉంచితే అసలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన మోడీకి రావడానికి కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం ద్వారానే వచ్చిందనీ, ఒక విధంగా చెప్పాలంటే.. కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

అంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు యథేచ్ఛగా వాడేస్తూ ఉండేవారు. విద్యుత్ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే విద్యుత్ వృధాను అరికట్టడం అన్న పేర ప్రీపెయిడ్ మీటర్లను బిగించడానికి నిర్ణయించిందో అప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదే చెబుతోంది. వ్యవసాయానికి విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదనీ, కానీ ఉచిత విద్యుత్ పేర విద్యుత్ వృధాను అరికట్టడమే తమ లక్ష్యమనీ చెబుతూ కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని చెబుతున్నామంటోంది.  కనీ కేసీఆర్ తన రాష్ట్రంలో తన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు ఏ కారణంతో అయితే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయించారో.. అదే కారణంతో కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తానంటే మాత్రం ససెమీరా అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రీపెయిడ్ రీచార్జబుల్ ఎలక్ట్రికల్ మీటర్లను బిగించేశారు. ముందుగా చెల్లించిన మేరకు విద్యుత్ ను వినియోగించిన ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఆలస్యమైతే రిచార్జ్ చేయించుకునే వరకూ ఆయా కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదీ సంగతి ఇప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయానికి వస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల.. ప్రభుత్వం ఆ మీటర్ మేరకు విద్యుత్ బిల్లు చెల్లించడం ఆలస్యమైతే వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. మనీ ట్రాన్స్ఫర్ తరహాలో రైతులు వినియోగించుకున్న మేరకు అయిన చార్జీల సొమ్మును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేస్తుంది. దానితొ వారు విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బిల్లు సొమ్మును రైతుల ఖాతాలో వేయడం ఆలస్యమైతే.. రైతుకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

ఇలా మోడీ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మోటార్లను బిగించిన విధంగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.  ఇక కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడంతో ఆగడం లేదు. ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సమాయత్త మౌతున్నారు. అంటే గృహ వినియోగదారులు కూడా తాము వినియోగించుకోబోయే విద్యుత్ కు ముందుగానే సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ఆ సొమ్ముకు సరపడా విద్యుత్ వినియోగం పూర్తి కాగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనం కేసీఆర్ ను దీని సంగతేమిటని నిలదీస్తున్నారు. స్మార్ట్ మీటర్లన్నీ ప్రీపెయిడ్ ప్రాతిపదికగానే ఉంటాయనీ, అంటే ఫోన్ రీచార్జ్ చేయించుకున్నట్లుగా విద్యుత్ వినియోగం కూడా రీచార్జ్ విధానంలోనే సరఫరా అవుతుందనీ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అంటే చార్జ్ చేయించుకున్న మేర విద్యుత్ వినియోగించిన మరు క్షణం ఆటోమేటిగ్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేయించుకునే వరకూ సదరు గృహస్థు కుటుంబంతో సహా చీకట్లో మగ్గాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News