వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసకే విజయం?
posted on Nov 24, 2015 9:27AM
వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస విజయం సాధించబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు జరిగిన ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపులో తెరాస అభ్యర్ది పసునూరి దయాకర్ 1,82,368 ఓట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకి 37,422 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్యకి 26,964, వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ కి 3, 857 ఓట్లు పడ్డాయి.
ఈ ఉప ఎన్నికలలో తెరాస ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని మొదట భయపడినా, ఆ తరువాత జరిగిన అనేక సంఘటనలు తెరాస విజయావకాశాలను మెరుగుపరిచాయి. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికయిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనం అవడం, ఆ కారణంగా రాజయ్యతో సహా ఆయన భార్య, కొడుకు, అతని రెండవ భార్య సనలను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను పోటీలో దించవలసి వచ్చింది. ఈ కారణాల వలన కాంగ్రెస్ చాలా నష్టపోతే అది తెరాసకు కలిసి వచ్చిందని చెప్పవచ్చును.
ఇక తెదేపా-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా మంచి రాజకీయ అనుభవం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్న అభ్యర్ధిని నిలబెట్టకుండా, ఎవరికీ పెద్దగా పరిచయంలేని ఎన్.ఆర్.ఐ. డా. దేవయ్యను బీజేపీ అభ్యర్ధిగా నిలబెట్టడం కూడా తెరాసకు బాగా కలిసివచ్చింది. ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేయాలని ఉబలాటపడిన తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఒకవేళ పోటీలో నిలబెట్టి ఉండి ఉంటే, ఆయన తెరాసకు గట్టి సవాలే విసిరి ఉండేవారు. ఇక ఈ ఉప ఎన్నికలలో వైకాపా ప్రవేశం వలన కూడా ప్రతిపక్షాలకు పడవలసిన ఓట్లు చీలిపోయాయి.
చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు, ఈ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించాలానే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో తన మంత్రులను, పార్టీ సీనియర్ నేతలను దింపి ఎక్కడికక్కడ పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేసారు. వారి సమిష్టి కృషి, పైన పేర్కొన్న కారణాల చేత ఊహించినట్లే తెరాస ఈ ఉప ఎన్నికలలో పూర్తి ఆధిక్యతతో దూసుకుపోతోంది.