వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసకు సవాలు విసురుతున్న కాంగ్రెస్
posted on Nov 14, 2015 10:19AM
.jpg)
వరంగల్ ఉప ఎన్నికల ప్రకటన జారీ అవగానే “తమ పార్టీ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని” తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారు. అప్పటికి పార్టీ అభ్యర్ధి పేరు కూడా ఖరారు కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అనేక విపరీత పరిణామాల గురించి అందరికీ తెలుసు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను గండి కొట్టేవేనని భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నపటికీ తెలంగాణా నేతలందరూ చాలా తక్కువ సమయంలోనే కూడబలుకొని, కలిసి కట్టుగా నిలబడి చాలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ ఉప ఎన్నికలలో అధికార తెరాసను ఎదుర్కొనేందుకు సిద్దమవడం విశేషం. ఇంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించబడిన సిరిసిల్ల రాజయ్య జైలుకి వెళ్ళడంతో ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణని బరిలోకి దింపి కాంగ్రెస్ నేతలందరూ చాలా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలను చూసి తెరాస తన గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేసింది. తమ పార్టీ ఎన్నికలలో గెలవడం తధ్యమే కానీ మెజార్టీ తగ్గకుండా చూసుకోవడమే తమకు ముఖ్యమని చెప్పుకొనేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా తేరుకొని మళ్ళీ తమతో తలపడగలదని ఊహించలేకపోవడంతో ఇప్పుడు తెరాస నేతల్లో ఆందోళన మొదలయింది. అందుకే మళ్ళీ తెరాస నేతలు తమకు బాగా అచ్చివచ్చిన ‘ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా మీడియా, స్థానికత’ వంటి ఆయుధాలను బయటకు తీసి ప్రయోగించడం మొదలుపెట్టవలసి వచ్చింది. వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దయాకర్ తరపున ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్ “వరంగల్ లో ఓటు హక్కు లేని వాళ్ళు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని” ప్రశ్నిస్తున్నారు. స్థానికుడయిన తెరాస అభ్యర్ధి దయాకర్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేటీఆర్ స్థానికత అంశం లేవనెత్తగా, మరో మంత్రి హరీష్ రావు “ఒక రాజకీయ పార్టీ, మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషప్రచారం చేస్తూ వరంగల్ ఉప ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక తెరాస శ్రేణులు మన అభ్యర్ధి విజయానికి ఇంకా గట్టిగా కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా పూర్తి సమరోత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలవాటు ప్రకారం తెరాస ప్రభుత్వానికి 50 ప్రశ్నలతో కూడిన ఒక కరపత్రాన్ని విడుదల చేసి వాటికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నారు. “ఈ ఉప ఎన్నికలలో ఓడిపోతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి విసిరిన సవాలును వారు స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించడం విశేషం. అది వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది.
తెరాస విసిరిన ఆ సవాలును తాము స్వీకరిస్తున్నామని, అలాగే ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి దయాకర్ ఓడిపోయినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు బాధ్యత వహించి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ తెరాసకు ప్రతి సవాలు విసిరారు. ఈ సవాళ్లు ప్రతిసవాళ్ళ సంగతి ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్-తెరాసల మధ్యనే సాగేట్లు ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ తేరుకొని మళ్ళీ పోరాటానికి సిద్దం అవగలగడం, అధికార పార్టీని ఓడించగలనని ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం చాలా మెచ్చుకోవలసిన విషయమే.