తెలుగు రాష్ట్రాల్లో వాలనున్న వాల్‌మార్ట్
posted on Apr 24, 2015 12:57PM

ఇప్పటికే హైదరాబాద్‌లో తన బ్రాంచ్‌లను ప్రారంభించిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇక తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ స్థాయిలో తన స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అనుమతులు తదితరాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాల్ మార్ట్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరి ప్రతిపాదనలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన లభించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్‌మార్ట్ ఏర్పాటు చేయబోయే స్టోర్‌లకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే విషయంలో తన సహకారం అందించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. దీనికోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాల్‌మార్ట్‌కి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అంటూనే, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో ఏపీ, తెలంగాణల్లో వాల్‌మార్ట్ విజృంభించబోతున్నట్టు అర్థమవుతోంది.