విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ కెమికల్ గ్యాస్ 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఎల్జీ పాలిమర్స్‌, ఆర్‌.ఆర్‌ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు.. కెమికల్ గ్యాస్ వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ.. మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలువరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనలో దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

గ్యాస్ లీకేజీ ఇంకా అదుపులోకి రాలేదు. చాలామంది భయంతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో ఎల్జీ పాలిమర్స్‌, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సమీపంలో ఉన్న కాలనీలు, గ్రామాల ప్రజలు తమ ముక్కు, నోటికి అడ్డంగా తడి గుడ్డలను కట్టుకోవాలని, దీని వల్ల కొంతవరకూ ఉపశమనం ఉంటుందని జీవీఎంసీ అధికారులు సూచించారు. 

తెల్లవారుజామున 3 గంటల నుంచి వాయువు విడుదల కావడం ప్రారంభమైంది. దీంతో చాలామంది వెంటనే దీన్ని గ్రహించలేకపోయారు. పరిశ్రమ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి మేఘాద్రి గెడ్డ వైపు, ఇతర సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. నాయుడు తోట, పద్మనాభపురం, కంపరపాలెం ప్రాంతాల్లోనూ రసాయన వాయువులు వ్యాపించడంతో అక్కడుండే వారంతా ఇళ్లను ఖాళీ చేసి వాహనాల్లో, పరుగులు తీస్తూ దూరంగా వెళ్లిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కళ్లు తిరిగి పడిపోయారు. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సాయం చేస్తోంది. అంబులెన్సుల్లో బాధితులను తరలిస్తున్నారు. సింహాచలం డిపో ఆర్టీసీ బస్సుల్లో కూడా కొందరిని వేరే ప్రాంతాలకు చేరవేస్తున్నారు. 

గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఈ కంపెనీ హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ టేకోవర్ చేసి, ఎల్జీ పాలిమర్స్‌గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, ఎక్స్‌పాండబుల్ పాలిస్టిరైన్ (థర్మాకోల్) వంటివి ఈ సంస్థలో తయారవుతాయి.

లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో దీన్ని తిరిగి ప్రారంభించారు. తెల్ల‌వారుఝుమున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu