'సర్జికల్ స్ట్రయిక్' అంటే ఎందుకింత ఆగమాగం! ఎవరినైనా దాచిపెట్టారా?: విజయశాంతి ట్వీట్ 

హైదరాబాదు పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలతో గ్రేటర్ రాజకీయం మరింత వేడెక్కింది. సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బండికి కౌంటరిస్తోంది. అయితే బండి సంజయ్ 'సర్జికల్ స్ట్రయిక్' కామెంట్లను సమర్దించారు మాజీ ఎంపీ విజయశాంతి. 'సర్జికల్ స్ట్రయిక్' అంటే  టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత ఆగమాగం అవుతున్నాయని ఆమె  ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీలోని రోహింగ్యాలు, పాకిస్థానీల గురించి ఆ రెండు పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని విజయశాంతి నిలదీశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే నిర్వహించిందని, పాతబస్తీలో ఎవరూ ఆ విధంగా లేరని సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వొచ్చు కదా అని విజయశాంతి ట్వీట్ చేశారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ విజయశాంతి ట్వీట్ చేయడంతో ఆమె కమలం గూటికి చేరడం ఖాయమని తేలిపోయింది. అయితే ముహుర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.