వార్ధా విలయం: చెన్నైలో భారీ వర్షం
posted on Dec 12, 2016 11:52AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. వార్థా మధ్యాహ్నానికి చెన్నైకి సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటీకే ప్రకటించింది. దీని ప్రభావంతో నగరంలో ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. దానికి తోడు తీవ్ర ఈదురుగాలులు వీస్తుండటంతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.