‘వరఖ్‌’తో జర భద్రం!

వరఖ్.. ఇది చాలామందికి తెలిసిందే. స్వీట్ల మీద, పాన్‌ల మీద మిలమిల మెరుస్తూ వుండే సిల్వర్ ఫాయిల్‌నే ‘వరఖ్’ అంటారు. వెండి రేకుని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చాలా పల్చగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత పల్చటి పొరలా తయారు చేస్తారు. వీటిని స్వీట్స్ మీద అద్దుతారు. వరఖ్ అద్దిన స్వీట్లని, పాన్లని మనం చాలా ఇష్టంగా తింటూ వుంటాం. వాటి మీద వరఖ్ వుంది కదా అని ఎక్కువ రేటు చెల్లించి మరీ మనం కొంటూ వుంటాం. నిజానికి వరఖ్ వున్న స్వీట్లు, పాన్లు తినడం వల్ల మనకేమైనా మేలు జరుగుతుందా? మేలు సంగతి అటుంచండి.. కీడు జరిగే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి చాలా అందంగా కనిపించే ఈ పల్చటి వెండి రేకులు వలన చాలా ప్రమాదాలు ఉన్నాయట. వరఖ్ వాడటం వల్ల స్వీట్లు, పాన్లు చూడగానే ఎట్రాక్టివ్‌గా వుంటాయి. అయితే ఈ అతి పల్చటి వెండి రేకుల్లో హానికారక పదార్ధాలు ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో క్యాన్సర్ కారక లోహాలు కొన్ని ఉంటున్నాయట. ఈ వరఖ్ మీద ‘ఇండస్ట్రియల్ టాక్సీకాలజీ రిసెర్చ్ సెంటర్’ పరిశోధకులు లక్నోలో ఆ మధ్య ఓ అధ్యయనంలో నిర్వహించారు. వరఖ్‌లో వెండితోపాటు సీసం, కాడ్మియం వంటివి ఉన్నట్టు గుర్తించారు. వరఖ్ తయారీ కోసం శుద్ధమైన వెండిని ఉపయోగించాలి. అయితే వరఖ్ తయారు చేస్తున్నవారు సరిగా శుద్ధి చేసిన వెండిని ఉపయోగించడం వల్లనే సమస్యలు వస్తున్నాయంటున్నారు పరిశోధకులు. ఆహార పదార్ధాలు, కల్తీ నివారణ చట్టం ప్రకారం 99.9 శాతం స్వచ్చమైన వెండిని మాత్రమే వరఖ్తయారీలో ఉపయోగించాలి. కానీ వాస్తవంలో అలా జరగటంలేదుట. ఆహార పదార్ధాలలో వాడే వరఖ్ నాణ్యతపై కచ్చితమైన నియంత్రణలు ఉండాలని సూచిస్తున్నారు వారు. అంచేత ఈసారి వరఖ్ అద్దిన స్వీట్లు, పాన్‌ తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండేం!

....రమ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News