పాయకరావు పేట.. తెలుగుదేశం కోట!

పాయకరావు పేట తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ  టీడీపీ అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో  అంటే 2014లో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత విజయం సాధించారు.

అయితే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలలో వంగలపూడి అనిత పాయకరావు పేట నుంచి పోటీ చేయలేదు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఓటమితో ఆమె కుంగిపోలేదు. పార్టీలో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా ఎదిగారు. వైసీపీ వేధింపులను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆమె మళ్లీ పాయకరావు పేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అనితకు మంచి గుర్తింపు ఉంది. అదీ కాకుండా వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు కూడా పొందారు.  వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు టీడీపీకి చెందిన మహిళా నేతలు ఎటువంటి వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం మహిళా నేతల చిత్రాలను మార్ఫింగ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేయడం వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు పరిపాటిగా మారింది. అయితే అటువంటి వేధింపులన్నిటీనీ ఎదుర్కొని వంగలపూడి అని గట్టిగా నిలబడ్డారు.  పార్టీ తరఫున వాయిస్ వినిపించే బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు.  పాయకరావు పేట రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో ఉన్నాయి. అలాగే బీసీ ఓట్లు కూడా అధికమే.  నియోజకవర్గంలోని 18 తీర గ్రామాల్లో మత్స్యకారుల ఓట్లు ఇక్కడ గెలపు ఓటములను ప్రభావితం చేస్తాయి.

వంగలపూడి అనిత తన వ్యక్తిత్వంతో, సవాళ్లను దీటుగా ఎదుర్కొని పాయకరావుపేటలో బలమైన పునాది వేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో పాయకరావు పేటలో ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను నియోజకర్గం మార్చారు. అయితే ఈ సారి ఆమెకు సొంత పార్టీ నుంచి పాయకరావు పేటలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.  దీంతో ఈ సారి పాయకరావు పేటలో మరో సారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.