వనజీవి రామయ్య ఇక లేరు

ట్రీ మేన్ ఆఫ్ ఇండియా వనజీవి రామయ్య ఇక లేరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య..  పచ్చదనమే ప్రాణంగా… మొక్కలు పెంచడమే జీవితంగా బతికి వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి వనజీవి రామయ్య శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనజీవి   ఈ తెల్లవారు జామున కన్నుమూశారు.

పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం లో వనజీవి రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.  అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రామయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసిన సమయంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో రామయ్య విస్తృతంగా పాల్గొన్నారు..వృక్షో రక్షితో రక్షిత: అనే నినాదంతో ఉన్న ఫలకాన్ని ఆయన మెడలో ధరించి కార్యక్ర మాలకు హాజరయ్యేవారు.

 కోటికి పైగా మొక్కలు నాటిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య మరణం సమాజానికి తీరని లోటని రేవంత్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.