ట్రంప్ సుంకాల దెబ్బకు ఆంధ్ర రొయ్యల రైతులు ఫ్రై
posted on Apr 8, 2025 11:52AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీ ఆక్వా రైతులపై పడింది. ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేం బాబో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు. ఇప్పటికే లక్షలు, కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెబుతున్నారు. మరి కొంత మంది రొయ్యల రేట్లు తగ్గించి మరీ కొంటున్నారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులపై ఈ నిర్ణయం ప్రభావం గట్టిగా పడింది.
ఇంపోర్ట్ టారిఫ్ భారం మన ఆక్వా రైతులపై డైరెక్ట్‌గా పడుతుండటంతో ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు భీమవరం, పాలకొల్లు, పెద్దాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లోని ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలను కొనుగోలు చేయడం మానేశాయి. రైతులు ప్రాధేయపడితే మార్కెట్ ధర మీద 30 రూపాయల నుంచి 90 రూపాయల వరకు తగ్గించి కొంటున్నారు. దీని వల్ల చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మరోవైపు ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు ఆక్వా ప్రొడక్ట్స్‌తో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు. అమెరికా కొత్తగా విధించిన ఇంపోర్ట్ టారిఫ్ ప్రకారం లెక్కిస్తే వీటిపై నష్టభారం 600 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కస్టమర్లపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు.
ఓ పక్క వ్యాధులు, మరోపక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పడటం లేదు. భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో, గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా రూ.40 వరకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా, 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. మొత్తంగా రూ.18 వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటే అధికం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 ఉండగా, గురువారం రూ.200కి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే, ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్ఠంగా కిలోకు రూ.30-40 వరకు తగ్గించారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోయారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు.