మునుగోడులో కారుదే జోరు.. శ్రీఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వెల్లడి
posted on Nov 3, 2022 6:00PM
మునుగోడులో కారు జోరు స్పష్టంగా కనిపించిందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప పోరులో విజయం కారుదేనని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ తేల్చింది. నియోజకవర్గంలోని మొత్తం 298 పోలింగ్ కేంద్రాలలో ఎంపిక చేసిన 36 పోలింగ్ కేంద్రాలలోనే వివిధ వర్గాల ఓటర్ల నుంచి సేకరించినట్లు ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ లో కారుకు అనుకూలంగా పలు ఆశక్తికర అంశాలు వెల్లడయ్యాయని పేర్కొంది. ముఖ్యంగా 45 ఏళ్లు అంతకు పైబడిన వారిలో అత్యధికులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారనీ, ఈ ఏజ్ గ్రూప్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల షేర్ వరుసగా 60, 25, 20గా ఉందని ఎగ్జిట్ పోల్ పేర్కొంది.
అదే యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపారు.
అదే 31-45 ఏళ్ల మధ్య వయస్కులలో అత్యధికులు తెరాస వైపే మొగ్గు చూపారు. ఈ ఏజ్ గ్రూప్ లో తెరాస తరువాత అత్యధికుల మొగ్గు కాంగ్రెస్ వైపు ఉంది. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.
ఇక మహిళల విషయానికి వస్తే అత్యధికులు తెరాస వైపు మొగ్గు చూపితే.. ఆ తరువాత వరుసగా బీజేపీ కాంగ్రెస్ లు ఉన్నాయి. మహిళలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల విభజన 44, 18, 25గా ఉంది.
ఇక రైతులు, పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులలో 66శాతం మంది తెరాసకే మొగ్గు చూపారు. అలాగే ప్రభుత్వోద్యోగులు, పదవీ విరమణ చేసిన వారిలో 40 శాతం మంది తెరాసకే జై కొట్టారు. ఈ కేటగరిలో 30 శాతం మంది మొగ్గు బీజేపీ వైపు ఉండగా 26శాతం మంది మాత్రమే కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్ లో యువత, నిరుద్యోగులలో అధికార టీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకొందని వెల్లడైంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే వామపక్షాలు తెరాసతో పొత్త పెట్టుకున్నా.. కమ్యూనిస్టుల ఓట్లు కూడా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య 65, 25, 5గా చీలిపోయారు. కమ్యూనిస్టు ఓట్లలో 65శాతం మంది టీఆర్ఎస్ కు ఓటేయగా, పాతిక శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ ఓట్లను అనుకున్నంతగా బీజేపీ వైపు మళ్లించడంలో విఫలమవ్వడమే.
ఇక తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం, ఆ వ్యవహారంలో బయటపడిన ఆడియో క్యాసెట్లు కూడా కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డికి ఏదో ఒక మేర నష్టం చేకూర్చాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం కనీసం 2% మంది ఓటర్లు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకం అయ్యిరని అంచానా.
అలాగే మునుగోడు నియోజకవర్గంలో మహిళా ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపలేదని కూడా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ప్రకారం సగటున తెరాసకు 41.5 శాతం, బీజేపీకి 35.5శాతం మంది ఓటర్లు మొగ్గు చూపితే కాంగ్రెస్ కు ఆ శాతం కేవలం 17 మాత్రమే. ఇక బిఎస్పీ 4.5 శాతం ఓట్లను దక్కించుకోగా, ఇతరులకు పడిన ఓట్ల శాతం 1.5 మాత్రమే.