వాయనాడ్‌.. ప్రియాంక గాంధీ వర్సెస్ ఖుష్బూ?

వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్న సంగతి విదితమే. అయితే ఆమెకు పోటీగా బీజేపీ తరఫున ప్రముఖ నటి ఖష్బూ బరిలో నిలవనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఖుష్బూ స్వయంగా ఖండించినప్పటికీ ఆగడం లేదు. ఎందుకంటే వాయనాడ్ లో తన పోటీ వార్తలను ఖండిస్తూనే ఒక వేళ బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను పోటీకి రెడీ అని ఖుబ్సు ముక్తాయించడమే.  కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధించిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. రాయబరేలి లోక్ సభ నియోజకవర్గం  నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వాయనాడ్ కు రాజీనామా చేసి రాయబరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 

వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పీపీ సునీర్‌పై 4 లక్షల 31వేల మెజార్టీతో విజయం సాధించగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి యేనీ రాజాపై 3 లక్షల 64వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఆమెకు పోటీగా ప్రముఖ నటి ఖుష్బును నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది.  పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీ‌పై పోటీ  రెడీ అనడం ద్వారా ఇక్కడ నుంచీ పోటీకి ఖుష్బూ కూడా రెడీ అయినట్లే చెప్పవచ్చు. ఏది ఏమైనా వాయనాడ్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, కమలం పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ అభ్యర్థిగా నిలవడం ఖరారైనట్లే, కమ్మూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి వామపక్షాల అభ్యర్థిగా సత్యన్ మొరేఖీ నిలబడుతున్నారు. ఇక కమలనాథులు తమ అభ్యర్థిగా ఖుష్బూను రంగంలోకి దింపడం దాదాపు ఖాయమైందంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని చెబుతున్నారు. వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 13న జరగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటే వాయనాడ్‌లోనూ ఫలితం వెలువడుతుంది.