టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు పెట్టింది
posted on Nov 23, 2014 2:52PM
భారతదేశంలో టాయ్‌లెట్ లేని ఇళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో వుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఇంట్లో టాయ్‌లెట్ వుండటం అనేది ఆరోగ్యపరంగా మేలు చేసే అంశం మాత్రమే కాదు.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇలా ఆత్మగౌరవం వున్న ఓ మహిళ బీహార్‌లో తిరుగుబాటు చేసింది. ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ ఓ బాబ్లీదేవి అనే యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. పాట్నా జిల్లాబిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బాబ్లీ దేవి (20)కి ఏడాది క్రితం వివాహం అయింది. బాబ్లీదేవి కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో టాయ్‌లెట్ కట్టించాలని ఆమె కోరుతోంది. అయితే ఆమె భర్త చూద్దాం చూద్దాం అంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. చివరికి మరుగుదొడ్డి నిర్మాణానికి తిరస్కరించాడు. ఈ విషయంలో గొడవ జరగడంతో ఆమె మీద చెయ్యి చేసుకున్నాడు. దాంతో బాబ్లీదేవి పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. అక్కడితో ఆగలేదు. తన భర్త మరుగుదొడ్డిని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. మరుగుదొడ్డి కట్టేదాకా ఆ ఇంటికి వచ్చేదేలేదంటూ స్పష్టంగా చెప్పేసింది. ‘బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు. ఇది ఆరోగ్యం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం’ అని బాబ్లీ దేవి చెప్పింది. ఇప్పటికైనా ఆమె భర్తకి, అలాంటి వారికి బుద్ధి రాకపోదా...