తిరుమలలో ఘోర అపచారం.. పాదరక్షలతో ఆలయప్రవేశానికి ప్రయత్నించిన ముగ్గురు

తిరుమలలో ఘోర అపచారం జరిగింది. తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

టీటీడీ విజిలెన్స్ పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాద్వారం వద్ద ముగ్గురు భక్తులు చెప్పులతో  భక్తులు ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి వారిని నిలిపివేశారు. దాంతో ఆ భక్తులు చెప్పులను మహాద్వారం వద్దే వదిలేసి స్వామి వారి దర్శనానికి లోనికి వెళ్లారు.  అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.