దొంగ రాజకీయాలు.. దొంగచాటు సంతకాలు!
posted on Mar 20, 2025 12:04PM
.webp)
వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక్క విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లు చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటతో దొంగ రాజకీయాలు నెరపింది. అలాగే 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాది లోగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది.
భారీ ఎత్తున మద్యం ధరలు పెంచేసి, నాసిరకం మద్యం సరఫరాకు తెరతీసి జగన్ ప్రభుత్వమే దొంగ వ్యాపారం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ దొంగ రాజకీయాల గురించి లెక్కకు మించి ఉదంతాలు ఉంటాయి. తాజాగా అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో కూడా వైసీపీ అదే దొంగ రాజకీయాలు నెరపుతోంది. అసెంబ్లీ బాయ్ కాట్ అన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. సభకు హాజరు కావడం లేదు కానీ దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి పారిపోతున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా అసెంబ్లీ ముఖంగా గురువారం (మార్చి 20) వెల్లడించారు.
వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం మీరెవరైనా చూశారా అంటే సభ్యులను ప్రశ్నించిన ఆయన.. సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ సభ్యులు ఇలా దొంగచాటుగా అసెంబ్లీ హాజరుపట్టీలో సంతకాలు పెట్టేసి సభకు హాజరు కాకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వారికి గౌరవం కాదని స్పీకర్ అన్నారు. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు హాజరు కావాల్సి ఉందన్న అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి హాజరుపట్టీలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్నారు.
ఈ సందర్భంగా ఆయన అలా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఇలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడుతున్నారని వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన రోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారనీ, ఆ తరువాత వారెవరూ సభకు రాలేదనీ స్పీకర్ స్పష్టం చేశారు. సభకు హాజరు కాకుండా హాజరుపట్టిలో దొంగచాటుగా సంతకాలు చేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్లు తాను గుర్తించడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేసి.. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించవద్దంటూ వైసీపీ సభ్యులకు హితవు చెప్పారు.