నాడు పోల‘వారం’.. నేడు పోల‘వరం’
posted on Mar 28, 2025 5:38PM
.webp)
పోలవరం కేవలం ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు మాత్రమే కాదు. కోట్లాది మంది ఆంధ్రుల కల. లక్షలాది మంది ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం. రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం, సాగు, తాగు నీటి కొరత, విద్యుత్ కొరతలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశతో ఎందరో.. తరతరాలుగా తాము జీవించిన ఊరును, ఇళ్లను వదులుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం తృణ ప్రాయంగా త్యజించిన త్యాగధనుల కథ, వ్యథ కూడా . గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, నిష్పూచీతనం కారణంగా పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబాలు అష్టకష్టాలూ పడ్డాయి.
వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలస్యం వారి జీవితాలను దుర్భరం చేశాయి.అసలు రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం పరుగులు తీసింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు అప్పట్లో సోమవారానికి పోలవారంగా నామకరణం చేసి.. క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించేవారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఆ ఐదేళ్లలో పోలవరం పరుగులు తీసింది.
అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ నిధుల విషయంలో సహాయ నిరాకరణ చేసినా చంద్రబాబు వెనకడుగు వేయలేదు.. రాజధాని కూడా లేని రాష్ట్రంలో, పేరు తప్ప మరేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఓ వైపు ప్రగతి పథకంలో నడిపిస్తూనే, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచే పోలవరం పనులకూ నిధులు వెచ్చించారు. అయితే దాదాపు 80శాతం పూర్తైన పోలవరంకు 2019లో గ్రహణం పట్టింది. తెలుగుదేశం అధికారం కోల్పోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ ఏపీకి అత్యంత ప్రధానమైన, కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి పనులను పడకేసేలా చేశారు. రెంటినీ నిర్వీర్యం చేశారు. పోలవరం నిర్వాసితుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు.. నేనేం చేయలేనంటూ చేతులెత్తేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అహంకారం, నిష్క్రియాపరత్వం, అరాచకత్వం మాత్రమే పాలనకు అర్ధం అన్నట్లుగా విర్రవీగిన జగన్ సర్కార్ ను జనం 2024 ఎన్నికలలో తిరస్కరించారు.
మళ్లీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ క్షణం నుంచీ పోలవరం పరుగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సారి కేంద్రంలోని మోడీ సర్కర్ నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ప్రజలలో ఆనందాన్ని నింపింది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గురువారం (మార్చి 27) సందర్శించారు. ఆ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో ముఖాముఖీ మాట్లాడారు.వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ప్రకటించి ఊరుకోకుండా.. ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందుగానే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తానని ప్రకటించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని విస్పష్ట హామీనిచ్చారు. పరిహారం కూడా పారదర్శకంగా అందిస్తామన్నారు. ఆశలు వదిలేసుకున్ననిర్వాసితుల్లో గుండె ధైర్యం నింపారు. తమ త్యాగం వృధా కాలేదన్న సంతృప్తి నిర్వాసితుల కళ్లల్లో కనిపించింది. దీంతో పరిశీలకులు నాడుపోల ‘వారం’ అంటూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తించిన చంద్రబాబు నేడు పొల‘వరం’ అందిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.