శ్రీవారి హుండీలో చోరీ యత్నం
posted on Mar 23, 2021 3:53PM
శ్రీవారి హుండీలో దొంగతనానికి ప్రయత్నం. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. అవును, కలియుగ దేవుని సన్నిధానంలో దొంగతనానికి తెగించాడో దొంగ. అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే.. హుండీలో నుంచే నగదు తస్కరించబోయాడు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. అతగాడు అదరలేదు, బెదరలేదు. దర్జాగా హుండీలో చేయిపెట్టి 30వేలు బయటకు తీసే ప్రయత్నం చేశాడు.
దొంగ కక్కుర్తి దొంగది. విజిలెన్స్ పని విజిలెన్స్ సిబ్బందిది. ఆ దొంగ శ్రీవారి హుండీ నుంచి డబ్బు తీస్తుండటాన్ని సీసీ కెమెరాల్లో చూశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. వెంటనే అప్రమత్తమయ్యారు. చోరీకి ప్రయత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి పూర్వాపరాలు విచారిస్తున్నారు.