పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు... జగన్ తీరుపై మరో పత్రిక సంచలన కథనం...
posted on Feb 10, 2020 11:08AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైనా, ప్రభుత్వ విధానాలపైనా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కియా తరలిపోతోందంటూ కియాపై రాయిటర్స్ రాసిన కథనంతో రాష్ట్రంలో కల్లోలం చెలరేగగా, ఇఫ్పుడు మరో ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన ఆర్టికల్ మరింత కలవరం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ది ఎకనమిక్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. జగన్ విధానాలను ఒక రేంజులో ఏకిపారేసింది. జగన్ తీరుతో కొత్తగా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టేందుకు జంకుతుండగా... ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోతున్నారంటూ డేరింగ్ కథనం ప్రచురించింది. రివర్స్ స్వింగ్ పేరుతో రాసిన ఆర్టికల్లో జగన్ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది.
కేంద్ర వాణిజ్యశాఖ, ప్రపంచబ్యాంక్, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సర్వేల ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు వాణిజ్యానికి అనుకూలందని, అయితే... జగన్మోహన్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక... వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని కథనంలో తెలిపింది. జగన్ నిర్ణయాలతో ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడుదారులకు ముప్పు ఏర్పడిందంటూ విశ్లేషించింది. విండ్ అండ్ సోలార్ పవర్ టారిఫ్ ల పునసమీక్ష... పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల రద్దు... ఆయా కంపెనీలకు కేటాయించిన భూములను వాపస్ తీసుకోవడంలాంటి నిర్ణయాలతో ప్రమాదకర సంప్రదాయానికి జగన్ శ్రీకారం చుట్టారని కథనంలో రాసుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నందుకు చాలా పశ్చాత్తాపడుతున్నామని అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి సంస్థ అక్మె సోలార్ హోల్డింగ్స్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించింది.
ఇక, కియా తరలిపోతోందంటూ రాయిటర్స్ రాసిన కథనం తర్వాత అలాంటిదేమీ లేదంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం.... అటు కియా యాజమాన్యం ఖండించినా... జగన్ ప్రభుత్వానికి-కియా కంపెనీకి మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నమాట మాత్రం వాస్తవమని... అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ అభిప్రాయపడింది.
మరోవైపు, పీపీఏల రద్దు దిశగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర డిస్కములపై పెద్దఎత్తున రుణభారం పడుతుందని విశ్లేషించింది. ఆయా విద్యుదుత్పత్తి సంస్థలకున్న బకాయిలతో కలిపి 21వేల కోట్ల రూపాయల రుణభారం డిస్కములపై పడుతుందని తెలిపింది. అయితే, ఇలా ఒప్పందాలను రద్దు చేసుకుంటూపోతే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని... ఇప్పుడు పీపీఏలపై పునసమీక్షించిన ప్రభుత్వం... ముందుముందు మిగతా రంగాల్లో జరగొచ్చని, ఇది ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదంటూ అభిప్రాయపడింది. మొత్తానికి జగన్ ప్రభుత్వంపై జాతీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రచురిస్తోన్న కథనాలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును... అలాగే, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రచురించడం కలకలం రేపుతున్నాయి.