త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న ముఖ్యమంత్రుల వారసులు..!

ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప‌ది మంది మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఆరుగురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు, మ‌రో ఇద్ద‌రు బంధువులు  ఎన్నికల బరిలో  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

1) కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున‌ డోన్ నుంచి పోటీ చేస్తున్నారు.  మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.  గతంలో సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

2) బాలకృష్ణ టీడీపీ త‌ర‌ఫున‌ హిందూపురం నుంచి పోటీలో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమారుడు బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే రేసులో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు బాలయ్య. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 

3)  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి,  టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో వున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. 

4) నాదెండ్ల మనోహర్ జనసేన అభ్య‌ర్థిగా తెనాలి నుంచి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్. తెనాలి నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. వైఎస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. 

5) నేదురుమల్లి  రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.  ఈయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

6) నారా లోకేశ్ టీడీపీ అభ్య‌ర్థిగా మంగళగిరి నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి ఓడిపోయిన లోకేశ్.. ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు.

7) ప్రస్తుత సీఎం వైఎస్ జ‌గ‌న్‌ పులివెందుల నుంచి పోటోలో వున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో వున్నారు. కడప ఎంపీగా 2 సార్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షనాయకుడయ్యారు. 2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 

8) వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి క‌డ‌ప ఎంపిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ కుమార్తె. షర్మిల త‌న అదృష్టాన్ని ఈ ఎన్నిక‌ల్లో పరీక్షించుకుంటున్నారు.  తండ్రి మరణానంతరం వైసీపీలో షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అనంతరం కుటుంబ తగాదాల నేపథ్యంలో ఏపీని వదిలి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఇటీవల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగారు.

మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆరుగురు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండగా,  మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు కూడా ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరే కాకుండా మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

9) నల్లారి బ్రదర్స్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో వున్నారు.  మరోవైపు మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.

10) కాసు మహేశ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మహేశ్ రెడ్డిది కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంగళరెడ్డికి ఈయన మనవడు.  మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నరసరావుపేట ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. టంగుటూరి అంజయ్య, రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌