ఏపీలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో ఆ దేవుడికే తెలియాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడున్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడి పోవడానికి, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం. అలా రాష్ట్రంలో సమాధిలోకి చేరిపో్యిన కాంగ్రెస్ పార్టీ అస్థిపంజరం రాష్ట్ర రాజకీయాలను ఏదో ఉద్ధరించాలని, ఊడబొడవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది అసంభవం అని రాష్ట్ర రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా చెబుతారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకత్వానికి కూడా తెలుసు.. కానీ దింపుడు కళ్ళం ఆశకంటే మరింత అడ్వాన్స్ అయిన ఆశతో తన ప్రయత్నాలు చేస్తూనే వుంది.
ఈసారి ఎన్నికల సందర్భంగా సరికొత్త తురుఫుముక్క వై.ఎస్.షర్మిలతో రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో తన బలం ఎలాంటిదో తెలిసికూడా అన్ని పార్లమెంట్, అన్ని లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించే వ్యూహంలో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలలో ఇప్పటికే దాదాపుగా చాలావాటికి అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి తాను రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకం అవుతానని కలలు కంటోంది.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.షర్మిల తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భావించకుండా, కేవలం అన్నని వ్యతిరేకిస్తున్న చెల్లెలిలా మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం గురించి తప్ప మరే స్థానం గురించి ఆమె ఆలోచించడం లేదు. 
ఇక పార్లమెంటు బరిలో వున్నావారిలో షర్మిల, కొప్పుల రాజు, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, చింతా మోహన్ తప్ప మిగతా స్థానాల నుంచి పోటీ చేస్తున్న వారికి ఎలాంటి బలం, బలగం లేదు. ఏదో ఆటలో అరటిపండులా వున్నారే తప్ప బలమైన అభ్యర్థులుగా లేరు. ఆమాటకొస్తే పైన పేర్కొన్న బలం, బలగం వున్నవారు కూడా గెలిచే అవకాశాలు లేవు. ఒక్క షర్మిల అయినా గెలిచే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయిగానీ, అదికూడా డౌటే. 
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి పనికిరాని దారిన పోయే దానయ్యలకి కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పంచేసి చేతులు దులుపుకుంది. ఫలానా నియోజకవర్గానికి కంటెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరిగే ఉబలాటం వున్నవాళ్ళు కూడా అభ్యర్థులుగా నిలబడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలో నిలబెడితే, వాళ్ళు వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చి తెలుగుదేశం కూటమికి మేలు జరిగేలా చేస్తారన్న అభిప్రాయం మొదట్లో రాజకీయ పరిశీలకులకు కలిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాంటి అవకాశాలేవీ లేనట్టు అర్థమవుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టే తప్ప ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.