తెలంగాణలో చలి పంజా...మూడు రోజులు వణుకుడే
posted on Jan 11, 2026 11:21AM

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం చలి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో 4.8 °C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9 °C ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.