కాంగ్రెస్ పాదయాత్రలో ముళ్ళు...

 

పాపం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టింది. కాకపోతే ఆ పాదయాత్రలో పోలీసులు ముళ్ళులాగా మారి కాంగ్రెస్ నాయకుల కాళ్ళలో గుచ్చుకున్నారు. అదీ విషయం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి విజన్‌తో ఎర్రగడ్డ ఆస్పత్రిని అనంతగిరి అడవుల్లోకి, సచివాలయాన్ని ఎర్రగడ్డలోకి తరలించే ప్లాన్ చేశారు. సచివాలయం ఉన్న స్థలంలో వందల అంతస్తులతో భారీ భవంతులు నిర్మించే ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఇది అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా నచ్చలేదు. కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం నాడు హైదరాబాద్‌లో గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో పోలీసుల అనుమతి కోరారు. పోలీసులు అంత సీన్ లేదని చెప్పేశారు. మరి ప్రజాస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థని గౌరవించి కాంగ్రెస్ నాయకులు ఊరుకోవచ్చు కదా... అలా ఊరుకోలేదు. పాదయాత్రని ధూమ్‌ధామ్‌గా ప్రారంభించారు. మొన్న ఎలక్షన్లలో ఓడిపోయి ఖాళీగా వున్న కాంగ్రెస్ నాయకులందరూ టిప్‌టాప్‌గా డ్రస్ చేసుకుని పాదయాత్ర మొదలెట్టారు. గాంధీ భవన్‌ నుంచి అలా కాస్త ముందుకు వచ్చారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. అంతలోనే చాలామంది కాంగ్రెస్ నాయకులకు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. పాపం నడిచి ఎంతకాలమైందో ఏంటో... సరిగ్గా అదే సమయానికి పోలీసులు వచ్చారు. పర్మిషన్ ఇవ్వకపోయినా మీ పాదయాత్ర ఏంటెహె అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులందర్నీ కట్టగట్టి వ్యానులో వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాసేపు పోలీసులతో పెనుగులాడినట్టుగా ప్రయత్నించారు. మీడియా కవరేజ్ వచ్చిందని అర్థం చేసుకున్న తర్వాత వెళ్ళి పోలీసుల జీపుల్లో కూర్చున్నారు. జీపులు అక్కణ్ణించి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వారిని ఎలాగూ రాచమర్యాదలతో వదిలేస్తారు.. అదీ జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu