హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషను
posted on Apr 18, 2015 8:50AM
.jpg)
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు శాసనసభలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తెదేపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ మొత్తం పదకొండు మందిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు తెలంగాణా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారు క్షమాపణ చెప్పేందుకు సిద్దపడినా వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయలేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవేవీ ఫలించలేదు. చివరికి వారు లేకుండానే శాసనసభ సమావేశాలు ముగించేసారు. దాని వలన సహజంగానే తెదేపా సభ్యులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిలో కొంచెం ఆవేశపరుడయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని చాలా ఘాటుగా విమర్శించడంతో తెరాస తరపున ఆయనపై ఒక కేసు దాఖలయింది. తనపై పెట్టిన ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషను వేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నిలదీసి ప్రశ్నించేవారిని భయపెట్టేందుకే ఈవిధంగా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని కనుక తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషనును హైకోర్టు విచారణకు స్వీకరించింది.